దీక్షా స్థలికి కదిలిన ప్రజా దండు

7 Oct, 2015 10:09 IST|Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన నిరవదిక నిరహార దీక్షకు భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. దీక్షకు స్పందించి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి భారీ ఎత్తున ప్రజలు దండుగా కదిలారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోపాటు సామాన్య జనం కూడా కుప్పలుగా గుంటూరు శివారులోని నల్లపాడు రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన దీక్షా స్థలికి కదిలారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి దీక్షకు మద్దతుగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో 30 వాహనాల్లో బయలుదేరారు.

అలాగే, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పెద్ద ఎత్తున మద్దతుదారులతో దీక్ష వద్దకు కదిలారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి పార్టీ కన్వీనర్ వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో గుంటూరు నేతలు కార్యకర్తలు తరలి వెళ్లారు. పెద్దకూరపాడు నియోజకవర్గం నుంచి పార్టీ నేత అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో బయలు దేరారు. తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి గుత్తుల సాయి ఆధ్వర్యంలో 25 వాహనాల్లో కార్యకర్తలు వస్తున్నారు. అలాగే పీ గన్నవరం నియోజకవర్గం నుంచి కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో 50 వాహనాల్లో కార్యకర్తలు దీక్ష వద్దకు బయలుదేరారు. దర్శి నియోజకవర్గ ఇంఛార్జ్ శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో 150 వాహనాల్లో దీక్షకు బయల్దేరారు.

మరిన్ని వార్తలు