దుర్గమ్మ దేవాలయానికి ముప్పు!

7 Aug, 2017 09:11 IST|Sakshi
దుర్గగుడిలో కోనేరు కోసం భారీ యంత్రంతో ఇంద్రకీలాద్రిని తవ్వుతున్న దృశ్యం

భారీ యంత్రాలతో కోనేరు తవ్వకం
గుడిలోకి వస్తున్న ప్రకంపనలు
అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం: ఈఈ భాస్కర్‌


సాక్షి, విజయవాడ: అభివృద్ధి పేరుతో ఇంద్రకీలాద్రిపై అధికారులు చేస్తున్న హడావుడి.. అమ్మవారి దేవాలయానికి, విగ్రహానికి ముప్పుగా మారింది. ఇప్పటికే ఇంద్రకీలాద్రిపై పలు నిర్మాణాలను అధికారులు తొలగించారు. అలాగే కొత్త నిర్మాణాల కోసం పర్వతాన్ని భారీ యంత్ర పరికరాలతో తవ్వుతున్నారు. కొత్త అందాలకు ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప ఎప్పుడో నిర్మించిన దేవాలయాల గురించి అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గతంలో ఇంద్రకీలాద్రిపై కోనేరు ఉండేది. తరువాత దీన్ని మూసివేసి ఇక్కడే భవానీ మండపాన్ని నిర్మించారు.

ఇప్పుడు మళ్లీ ఆ ప్రదేశంలోనే జలపాతం, కోనేరు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 21 మీటర్లు పొడవు, 8 మీటర్లు వెడల్పు, 1.5 మీటర్ల లోతులో కోనేరును నిర్మిస్తున్నారు. ఈ కోనేరులోకి నీరు పడే విధంగా జలపాతం ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం అమ్మవారి నిధులు రూ. 3 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కోనేరు తవ్వకానికి భారీ యంత్రాలు వాడుతుం డటంతో కొండంతా ప్రకంపనలు వస్తున్నాయి. పొక్లెయినర్లు, డ్రిల్లింగ్‌ మిషన్లతో తవ్వినప్పుడు ఆలయంలోనే భారీగా ప్రకంపనలు వస్తున్నాయని, అమ్మవారి విగ్రహం కూడా అదిరే అవకాశం ఉందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఘాట్‌రోడ్డు విస్తరణలో భాగంగా ఇంద్రకీలాద్రిని భారీ యంత్రాలతో పగలగొడుతున్నప్పుడు ఇలాంటి సమస్యే వచ్చింది.

దీనిపై అర్చకులు, అధికారులు అభ్యంతరం తెలపడంతో  తవ్వకాలను ఆపేశారు. ఇప్పుడు ఆలయానికి అత్యంత సమీపంలోనే కోనేరు, జలపాతం కోసం కొండను పగల గొడుతుంటే మాత్రం దేవస్థానం అధికారులు మాట్లాడటం లేదు. కేవలం అమ్మవారి దేవాలయానికే కాదు.. పక్కనే ఉన్న ఉపాలయాల భద్రతకు ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలాఉండగా దసరాలోగా కోనేరు, జల పాతాన్ని సిద్ధం చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.

దేవాలయానికి ఇబ్బంది లేదు: ఈఈ భాస్కర్‌
కోనేరు కోసం భారీ యంత్రాలతో తవ్వడం వల్ల దేవాలయం భద్రతకు ఇబ్బంది ఉండబోదు. అన్ని జాగ్రత్తలు తీసుకునే కోనేరు నిర్మాణం చేపడుతున్నాం. కోనేరుతో భక్తులకు ఎంతో ఆహ్లాదం కలుగుతుంది. గ్రీనరీతో జలపాతాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతాం.

మరిన్ని వార్తలు