విషాదం

2 Feb, 2017 02:05 IST|Sakshi
విషాదం

ప్రమాదంలో ముగ్గురి మృతి
ఇద్దరు వరుసకు అన్నదమ్ములు
రెండు కుటుంబాల్లో విషాదం


వారు వరుసకు అన్నదమ్ములు. ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. పెళ్లి కూడా ఇద్దరూ ఒకేసారి చేసుకున్నారు. ఒకే రకమైన వ్యాపారం చేస్తున్నారు. వారి అన్యోన్యతను చూసి విధి ఓర్వలేకపోయింది. తిరుమల శ్రీవారి దర్శనానికి స్నేహితులతో కలిసి వెళుతుండగా బస్సు రూపంలో వచ్చి పొట్టన పెట్టుకుంది. ప్రస్తుతం గర్భంతో ఉన్న వారి ఇద్దరి భార్యలూ చేస్తున్న రోదనలతో తిరుపతి రుయా ఆస్పత్రి దద్దరిల్లింది. వారి మృతితో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది.

రొంపిచెర్ల:  మండలంలోని పెద్దగొట్టిగల్లు సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. అలాగే బుధవా రం మరొక వ్యక్తి ఆస్పత్రిలో మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. బెంగళూరు పట్టణానికి చెందిన లారీ ట్రాన్స్‌పోర్టు యాజమానులు వెంకటేశ్వరమూర్తి(30) ప్రసన్నకుమార్‌(30), స్నేహితులు మంజునాథ(35), నాగరాజ(30)తో కలిసి మారుతీ కారులో తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం బయలుదేరారు. పెద్దగొట్టిగల్లు వద్ద బుధవారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో చైన్నై నుంచి కర్ణాటకలోని హోస్‌పేటకు వెళుతున్న మానస ట్రావెల్‌ బస్సు ఢీకొంది. వెంకటేశ్వరమూర్తి, ప్రసన్నకుమార్‌ అక్కడికక్కడే మృతి చెందారు. మంజునాథ, నాగరాజ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు 108 ద్వారా పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంజునాథ పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయా ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అక్కడ అతను బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతులు ఇద్దరు వరుసకు అన్నదమ్ములు. ఇద్దరూ ఒకే రోజు వివాహం చేసుకున్నారు. వారి భార్యలు భవ్య, చైత్ర గర్భవతులు. వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని వస్తామని వెళ్లిన వారు రోడ్డు ప్రమాదం లో మృతి చెందడంపై కుటుంబ సభ్యులు బోరున విలపించారు. క్షతగాత్రు డు నరేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రహీముల్లా తెలిపారు. ప్రైవేటు బస్సును పోలీసులు సీజ్‌ చేశా రు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు వారు బెంగళూరుకు తీసుకెళ్లారు.

మరిన్ని వార్తలు