పెళ్లికొస్తూ.. పై లోకాలకు..

4 Jun, 2017 23:20 IST|Sakshi
పెళ్లికొస్తూ.. పై లోకాలకు..

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం
ముగ్గురి దుర్మరణం - మరో పది మందికి గాయాలు
- మృతుల్లో అమడగూరు మండల యువకుడు


వంశోద్ధారకుడి కోసం ఆ దంపతులు ఎన్నో నోములు నోచారు. వారి నోముల ఫలితంగా వరుసగా నలుగురు ఆడబిడ్డల తరువాత పుట్టిన బిడ్డ అతను. అందరి ఆశలు అతని మీదే. పూలమ్మి మంచి చదువు చదివించారు. ఇప్పుడిప్పుడే ఓ ఉద్యోగం సాధించి, జీవితంలో నిలదొక్కుకుంటున్న తరుణంలో విధికి కన్నుకుట్టిందేమో.. తెల్లారితే దాయాదుల ఇంట్లో జరిగే పెళ్లికి బైక్‌లో బయలుదేరిన ఆ యువకుడ్ని మార్గమధ్యంలోనే మృత్యువు రోడ్డు ప్రమాదరూపంలో కబళించి, కాటికి పంపింది. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది.
- అమడగూరు(పుట్టపర్తి)

అమడగూరు మండలం చీకిరేవులపల్లికి చెందిన రెడ్డమ్మ, రమణారెడ్డి దంపతుల ఏకైక కుమారుడు శివశంకర్‌రెడ్డి(25) కర్ణాటక రాష్ట్రం బెంగళూరు-హొసకోట సమీపంలోని శెట్టిపల్లి క్రాస్‌లో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఇదే ప్రమాదంలో కర్ణాటక వాసులు మరో ఇద్దరు మరణించగా, ఇంకో పది మంది గాయాపడ్డారని పోలీసులు, మృతుని బంధువులు తెలిపారు.

ఎలా జరిగిందంటే..
బీఫార్మసీ చేసిన శివశంకర్‌రెడ్డికి బెంగళూరులో ఇటీవలే ఉద్యోగం వచ్చింది. తమ స్వగ్రామంలోని దాయాదుల ఇంట్లో ఆదివారం ఉదయమే జరగనున్న పెళ్లికి అతను శనివారం రాత్రే బైక్‌లో బయలుదేరాడు. మార్గమధ్యంలో శెట్టిపల్లి క్రాస్‌లోకి రాగానే.. చింతామణి నుంచి బయలుదేరిన మినీ బస్సు ముందుగా వెళ్తున్న కారును ఓవర్‌టెక్‌ చేయబోయింది. ఈ క్రమంలో అదుపు తప్పి కారును బలంగా ఢీకొనడంతో మినీబస్సు మూడు పల్టీలు కొట్టి, ఎడమ వైపు నుంచి కుడి వైపునకు రోడ్డుకడ్డంగా పడిపోయింది. ఈ ప్రమాదంలో కర్ణాటక వాసులు ఇద్దరు మృతి చెందగా, మరో పది మంది గాయపడి ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో బెంగళూరు నుంచి వచ్చిన శివశంకర్‌రెడ్డి బైక్‌ మినీ బస్సును ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మరణించారు.

పువ్వుల్లో పెట్టి చూసుకున్నా...
పూట గడవడమే కష్టమైనా కుటుంబంలో పుట్టినా.. కసి, క్రమశిక్షణ, పట్టుదలతో బీఫార్మసీ పూర్తి చేసి ఇప్పుడిప్పుడే ఉద్యోగంలో స్థిరపడుతున్న కుమారుడ్ని చూసి వృద్ధ తల్లిదండ్రులు, ఆడబిడ్డలు, బంధువులు అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే చెట్టంత కుమారుడు విగతజీవిగా మారడంతో వారు తల్లడిల్లిపోయారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగానే వారు కుప్పకూలిపోయారు. ఇక మేం ఎవరికోసం బతకాలి కొడకా.. ముసలోళ్లమైన మాకు అండగా ఉంటావనుకుంటిమే. ఇక మాకు దిక్కెవరు తండ్రీ’ అంటూ కుమారుడి మృతదేహంపై పడి తల్లిదండ్రులు హృదయ విదారకంగా విలపించిన తీరు అందరి హృదయాలను బరువెక్కించింది.
 
పుట్టపర్తి మండలంలో మరొకరు..
పుట్టపర్తి అర్బన్‌ : గోరంట్ల-కొత్తచెరువు మార్గంలోని పుట్టపర్తి మండలం జగరాజుపల్లి సమీపంలో గల మంగళకర కళాశాల వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన లక్ష్మానాయక్‌(55) అ‍క్కడికక్కడే మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి కథనం మేరకు.. ఉదయం 8 గంటలకు గోరంట్ల నుంచి ఎనుములపల్లికి బయలుదేరిన నరసింహమూర్తి ఆటోలో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యంలోని మంగళకర కళాశాల వద్దకు రాగానే ఐచర్‌ వాహనం ఓవర్‌టెక్‌ చేసే ప్రయత్నంలో ఆటోను ఢీకొంది. ఆటోను 20 మీటర్ల దూరం ఐచర్‌ వాహనం ఈడ్చుకెళ్లింది.

ఆటోలో ప్రయాణిస్తున్న కల్లితండాకు చెందిన లక్ష్మానాయక్‌ మరణించగా, పుట్టగుండ్లపల్లికి చెందిన వెంకటమ్మ, ఓబుళమ్మ, గువ్వలగుట్టపల్లికి చెందిన గంగమ్మ మరో మహిళ, జగరాజుపల్లికి చెందిన గౌతమి అనే విద్యార్థిని, ఆటో డ్రైవర్‌ నరసింహమూర్తి, గుమ్మయ్యగారిపల్లికి చెందిన అంజనేయులు తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వచ్చిన ప్రయాణికులు 108కు సమాచారం అందించారు. వారిని వెంటనే పుట్టపర్తి సత్యసాయి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. కాగా లక్ష్మానాయక్‌  బ్రాహ్మణపల్లి తండాలో జరిగే వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తూ ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహంపై పడి భార్య సాలీబాయి న్నీరుమున్నీరయ్యారు.

వెంబడించి పట్టుకున్న గ్రామస్తులు
నిర్లక్ష్యంగా నడపడగమే గాక.. ఒకరి మృతికి కారణమైన ఐచర్‌ వాహనాన్ని ప్రమాదం జరిగిన వెంటనే ఆపకుండా వెళ్లిపోయిన డ్రైవర్‌ను గ్రామస్తులు వెంబడించారు. చివరకు కప్పలబండ వద్ద పట్టుకున్నారు. విషయం తెలిసిన వెంటనే కొత్తచెరువు ఎస్‌ఐ రాజశేఖరరెడ్డి, పుట్టపర్తి రూరల్‌ ఏఎస్‌ఐ ప్రసాద్‌ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పెనుకొండ ఆస్పత్రికి తరలించారు. 

మరిన్ని వార్తలు