కుప్పకూలిన ఫ్యాక్టరీ :ముగ్గురి మృతి

5 Jul, 2013 04:26 IST|Sakshi

భివండీలో దుర్ఘటన
  ముగ్గురి మృతి  39 మందికి గాయాలు
 బిల్డర్ల అత్యాశకు మరో మూడు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అనుమతి లేకుండా అంతస్తుపై అంతస్తు నిర్మించేందుకు చేసిన ప్రయత్నం మరో 39 మందిని గాయాలకు గురి చేసింది. ఠాణే జిల్లాలో పక్షం రోజుల వ్యవధిలో రెండో భవనం కుప్పకూలింది.
 
 
 భివండీ, న్యూస్‌లైన్: భివండీ తాలూకా కల్హేర్‌లో గురువారం తెల్లవారుజామున ఓ రెండంతస్తుల భవనం నేలకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో 39 మందికి గాయాలయ్యాయి. మృతులలో నేపాల్‌కు చెందిన మున్నా దివాన్ (25), లాలా మహ్మద్ షేక్ (23), బీహార్‌కు చెందిన జీవన్ పాండే (25)లు ఉన్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. వివరాల్లోకెళితే.. కల్హేర్ ప్రాంతంలోని హరియంత్ కంపౌండ్‌లోని మహిళల దుస్తులు తయారయ్యే వస్త్ర పరిశ్రమ ఉంది.
 
  రోజు మాదిరిగానే ఆ కార్ఖాణాలో సుమారు 45 మంది కార్మికులు నైట్ షిప్ట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు ఇతర సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఊహించని విధంగా అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భవనం నేలకూలింది. భవనంలో ఉన్న వారు ఏమీ జరిగిందో తెలుసుకునేలోపే శిథిలాల కింద చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అలాగే ముంబై నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన 90 మంది జవానులు, ఎమర్జెన్సీ టీమ్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని, సహాయ చర్యలు ప్రారంభించారు.
 
 శిథిలాల కింది నుంచి 39 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీశారు. అయితే  వీరందరికి గాయాలు కావడంతో పట్టణంలోని ఇందిరా గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి, సాయినాథ్ హాస్పిటల్, కాశినాథ్ ఆస్పత్రిలకు తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. కలెక్టర్ పి.వేల్‌రాసూఠ7వ పేజీ తరువాయి
 పోలీస్ కమిషనర్ కె. రఘువంశీ, అధికారి నవనాథ్ జరే, తహసిల్దార్ సునిల్ శిందే, డీసీపీ ఎమ్.కే. బోస్లేతో పాటు కార్పొరేషన్ అధికారులు సంఘటనా స్థాలాన్ని సందర్శించారు.
 మూడో అంతస్తు నిర్మాణం చేపట్టడంతోనే....
 భవనం నేలకూలడానికి ప్రధాన కారణం మూడవ అంతస్తు నిర్మాణం చేపట్టడమేనని ప్రాథమికంగా భావిస్తున్నారు. అందిన వివరాల మేరకు.. ప్రమాదానికి గురైన ఈ భవనాన్ని 10 సంవత్సరాల క్రితం నిర్మించారు. రెండంతస్తులున్న ఈ భవనంపై అక్రమంగా మరో అంతస్తు నిర్మాణం చేపట్టినట్లు తెలిసింది. ఒకవైపు భవనం లోపల కార్మికులు పని చేస్తుండగా, పైన నిర్మాణ పనులు కొనసాగించినట్లు స్థానికులు తెలిపారు. భవన యజమాని కోసం గాలిస్తున్నామని ఠాణే పోలీస్ కమిషనర్ కేపీ రఘువంశీ చెప్పారు.
 ఈ ఘటనలో శిక్షించదగిన హత్యానేరంగా కేసు నమోదు చేశామన్నారు. ఠాణే జిల్లాలో పక్షం రోజుల వ్యవధిలో భవనాలు కూలడం ఇది రెండోసారి. ముంబ్రాలో జూన్ 22న ఓ నాలుగంతస్తుల భవనం కూలి ఏడుగురు మరణించిన సంగతి తెల్సిందే.
 క్షతగాత్రుల వివరాలు....
 మత్తిఉల్లా శేక్, శబ్దుల్లా శేక్, మహ్మద్ జాహిద్ అన్సారీ, మహ్మద్ జాకీర్ మహరున్, కమురుల్ ఆలి, సన్నికుమార్ కుస్వాహా, మహ్మద్ ఇస్లామ్, మహ్మద్ శేక్, మహ్మద్ అన్సారీ, మహ్మద్ లుక్‌మాన్, శ్రీకాంత్ కాంబ్లే, రాజేశ్ కుమార్ బ్రిజ్ మోహన్, ఒంప్రకాశ్ శ్రీరామ్, మహ్మద్ ఆమీన్ హాలీమ్, రాజారామ్ షా, అనూప్‌కుమార్ గోండా, మహ్మద్ ముస్తకీ ఫరోజ్, నజుహత్ శేక్, మహ్మద్ తాహీర్ మహమదీ, మునీఫ్ ఖాన్, మహ్మద్ సమీర్ హబీబ్, సమశుల్లా ఆలి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు