దేవుడిదగ్గరకు వెళ్లాలంటూ...

11 Jul, 2017 03:37 IST|Sakshi
దేవుడిదగ్గరకు వెళ్లాలంటూ...

కరప(కాకినాడరూరల్‌): ఆర్థిక ఇబ్బందులు లేవు, ముందురోజు కుమారుడు పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నారు..ఏం కష్టం వచ్చిందో ఏమో ముగ్గురు (అక్కా, చెల్లెలు, కుమార్తె) మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దేవుడు వద్దకు వెళ్లాలి, టైం అయిపోతోంది అంటూ ఆత్మహత్య చేసుకుని ఉంటారని స్థానికులు అంటున్నారు. ప్రార్థనలు చేస్తామని లోపలికెళ్లిన వారు తనువు చాలిస్తారని అనుకోలేదని తల్లి చంద్రం ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటన కరపలోని నీలయ్యతోట వీధిలో సోమవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు కరపలోని నీలయ్యతోట వీధికి చెందిన కరెడ్ల చంద్రం కుమార్తెలు రాసంశెట్టి సత్యవేణి (48), సత్తి ధనలక్ష్మి (40), ధనలక్ష్మి కుమార్తె సత్తి వైష్ణవి (18). సత్యవేణి, ఇద్దరు కుమారులతో అదే వీధిలో సొంతిల్లు కట్టుకుని ఉంటున్నారు. తల్లి చంద్రం పెంకిటిల్లులో ఒక పోర్షన్‌లో ఉంటోంది.

అదేఇంటిలో పక్కపోర్షన్‌లో ధనలక్ష్మి భర్త, ఇద్దరు కుమారులతో ఉంటోంది. వీరు క్రైస్తవ మతం తీసుకుని నాలుగేళ్లుగా చర్చికి వెళ్లి, ప్రార్థనలు చేసుకుని వస్తుంటారు. ఎవరితోను మాట్లాడరు, దైవభక్తి ఎక్కువగా ఉండటంతో వెళితే చర్చికి, లేకపోతే ఇంటివద్ద ప్రార్థన చేసుకోవడం వీరికి అలవాటు.   ఈ నేప«థ్యంలో ధనలక్ష్మి కుమారుడు రఘువీర్‌ పుట్టిన రోజును ఆదివారం జరిపి,  ఇంటివద్దనే అందరికీ భోజనాలు పెట్టి, పాస్టర్‌ నాగరాజు డాక్టర్‌తో ప్రార్థనలు చేయించారు. దేవుడు వచ్చేస్తున్నాడు, దేవుడి దగ్గరకు వెళ్లిపోవాలి అంటూ మాట్లాడుకోవడం, ప్రార్థనలు చేసుకోవడం జరుగుతోంది. ఆదివారం రాత్రి ముగ్గురు మహిళలు చర్చికి వెళ్లి అక్కడే ఉండిపోయారు. ఉదయం పాస్టర్‌ నాగరాజు లేచిన తర్వాత ప్రార్థన చేసి, పండ్లుపెట్టగా సత్యవేణి, ధనలక్ష్మి, వైష్ణవిలు ఇంటికి వచ్చేశారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో తల్లి చంద్రంతో ఇంటిలో దుష్టశక్తులు తిరుగుతున్నాయి, అవి పోయేందుకు ప్రార్థనలు చేస్తామని ఒక గదిలోకి వెళ్లి, గడియపెట్టారు.

 ఎంతకీ బయటకు రాకపోవడంతో ధనలక్ష్మి కుమారుడు రఘువీర్‌ తలుపు తట్టగా ఇంకా ప్రార్థన పూర్తవ్వలేదని లోపలనుంచే బదులిచ్చారు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో రఘువీర్‌ తలుపులు కొట్టినా తీయలేదు. అనుమానంతో ఇంటి వెనుక వైపున తలుపుపైకెత్తి తీసి చూసేసరికి ఉరివేసుకుని ఉన్నారు.అక్క వైష్ణవిని కిందికి దింపితే చనిపోయి ఉంది. వెంటనే పాస్టర్‌ దగ్గరకెళ్లి ఇంటికి తీసుకొచ్చి చూపించాడు. పాస్టర్‌ కరప ఎస్సై మెల్లం జానకిరాంకు సమాచారం అందించారు. కాకినాడ డివిజన్‌ ఇన్‌చార్జి డీఎస్‌పీ ఎం.వెంకటేశ్వరరావు, ఇంటిలిజెన్స్‌ సీఐ నూనె రమేష్, కాకినాడ పోర్టు సీఐ రాజశేఖర్‌తో కల్సి క్లూస్‌టీంతో ఘటనా స్థలానికి వచ్చి, వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముగ్గురు మహిళల ఆత్మహత్యకు కారణాలు దర్యాప్తు తేలాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు. డీఎస్పీ ఆధ్వర్యంలో కరప ఎస్సై జానకిరాం కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ప్రార్థనలు చేస్తామని వెళ్లిపోయారా..
 ప్రార్థనలు చేస్తామని గదిలోకి వెళ్లి ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోతారను కోలేదంటూ ఇద్దరు కుమార్తెలు, మనుమరాలు మరణాలు తలుచుకుని చంద్రం కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆమెను ఓదార్చడం ఎవరితరం కాకపోయింది.

ఇలా జరుగుతుందంటే పనిలోకి వెళ్లేవాడినికాదు
ఇలా జరుగుతుందని ముందుగా ఊహించి ఉంటే కాకినాడ పనిలోకి వెళ్లేవాడిని కాదని భార్య ధనలక్ష్మి, కుమార్తె వైష్ణవి మరణించడంపై సత్తి శ్రీనివాస్‌ గుండెలవిసేలా విలపించాడు. భార్య మృతదేహంపై పడి కొడుకుని, నన్ను వదిలి వెళ్లిపోయావా అంటూ బోరున విలపిస్తుంటే బంధువులు, ఇరుగు పొరుగువారు ఆపలేకపోయారు.

మరిన్ని వార్తలు