ముగ్గురిని మింగిన గని

14 Apr, 2016 03:42 IST|Sakshi
ముగ్గురిని మింగిన గని

మందమర్రి భూగర్భ గనిలో ఘోరం

 బెల్లంపల్లి: ఆదిలాబాద్ జిల్లా మందమర్రి ఏరియా శాంతిఖని గనిలో బుధవారం జరిగి న పెను ప్రమాదం ముగ్గురు కార్మికులను బలి తీసుకుంది. గని భూగర్భంలోని పైకప్పు  కూలడంతో ఆర్‌బీసీ కార్మికులు పోల్సాని హన్మంతరావు, రమావత్ కిష్టయ్య, మేసన్ మేస్త్రీ గాలిపల్లి పోశం దాని కింద నలిగి నిస్సహాయంగా ప్రాణాలొదిలారు. హన్మంతరావు, కిష్టయ్య రోజూలా ఉదయం 9 గంటల కు విధులకు వచ్చారు. పోశం మొదటి షిఫ్ట్ విధులకు వెళ్లారు. గనిలో దిగి పనులు ముగించుకుని, 52 లెవల్ వన్‌డీప్ దగ్గరి పంపు వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో అలిసిపోయి ఉండటంతో కాసేపు జంక్షన్ వద్ద సేద తీరారు. గని రక్షణ అధికారి సంతోష్‌రావు అటువైపు వచ్చి వెళ్లిపోగానే పైకప్పు బండ ఆకస్మికంగా కూ లింది. 5 అడుగుల పొడవు, 14 అడుగుల మందమున్న ఆ బండ కింద హన్మంతరావు, కిష్టయ్య, పోశం నలిగిపోయారు. మరో 20 మంది కార్మికులు ప్రాణాల అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. జంక్షన్ వద్ద పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టకపోవడమే ఈ ఘోరానికి కారణమని తెలుస్తోంది.

 సహాయక చర్యలు: ఘటనా స్థలికి రామకృష్ణాపూర్ నుంచి రెస్క్యూ సిబ్బందిని రప్పిం చారు. వారు జాకీలు, ఇతర సపోర్టు పనిముట్లతో బండరాళ్లను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. తొలగింపు అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగుతూనే ఉంది. భారీగా కూలిన ఆ రాళ్లను పూర్తిగా తొలగిస్తే గానీ మృతదేహాలను బయటకు తీసే పరిస్థితుల్లేవు. నిర్విరామంగా శ్రమిస్తే గురువారం తెల్లవారుజాము, లేదా మధ్యాహ్నం వరకు వాటిని వెలికితీసే అవకాశముంది. మందమర్రి ఏరియా జీఎం వెంకటేశ్వర్‌రెడ్డి తదితర అధికారులు గనిలో దిగి సహాయక పనులను పర్యవేక్షి ంచారు.

 దుఃఖసాగరం: గని ప్రమాదంలో మరణించిన ముగ్గురు కార్మికుల కుటుంబాలు తీవ్ర దుఃఖసాగరంలో మునిగిపోయాయి. ప్రమాదం జరిగాక ఐదారు గంటలదాకా మృతులెవరో నిర్ధారణ కాకపోవడంతో కార్మికుల కుటుంబాలన్నీ ఆందోళనకు గురయ్యాయి. మృతుల కుటుంబీకులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మాజీ ఎంపీ వివేకానంద, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్, కార్మిక సంఘాల నాయకులు వి.సీతారామయ్య బెల్లంపల్లి ఏరియా జీఎం కె.రవిశంకర్, కార్మికులు శాంతిఖని గనికి తరలివచ్చారు.

>
మరిన్ని వార్తలు