మృత్యువుతో పోరాడి ఓడిన నాగరత్నమ్మ

16 Jun, 2016 00:42 IST|Sakshi
మృత్యువుతో పోరాడి ఓడిన నాగరత్నమ్మ

* 17 రోజులపాటు కోమాలో
* దుండగుల దాడిలో తీవ్ర గాయాలపాలైన వృద్ధ దంపతులు
* భార్య మృతి,భర్త పరిస్థితి విషమం

తెనాలి రూరల్: దుండగుల దాడిలో తీవ్ర గాయాలపాలైన వృద్ధ దంపతుల్లో భార్య మృతి చెందింది. ఇంట్లో ఉన్న సొత్తును అపహరించుకెళ్లేందుకు వచ్చిన దుండగులు ఒంటరిగా ఉన్న దంపతులపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపర్చారు. 17 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన భార్యను మృత్యువు కబళించింది.

తెనాలి మండలం నందివెలుగు గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు బలభద్రుని వెంకటనారాయణశాస్త్రి, నాగరత్నమ్మ (85) తమ స్వగృహంలో నివసిస్తుండేవారు.మే నెల 29వ తేదీన వీరిపై గుర్తు తెలియని దుండగులు విచక్షనా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. మరుసటి రోజు 30వ తేదీ మధ్యాహ్నం వీరికి బట్టలు ఉతికేందుకు వచ్చే బాజి ఇంటికి వచ్చి చూడగా, గ్రిల్స్ లోపలి వైపు తాళం వేసి ఉంది.

ఎంత సేపు పిలిచినా స్పందన లేకపోవడంతో అక్కడికి సమీపంలో నివసించే దంపతుల కుమారుడి కుటుంసభ్యులకు తెలియజేసింది. వారు వచ్చి పిలిచినా ఫలితం లేదు. అనుమానం వచ్చి ఇంటి వెనుకకు వెళ్లి చూడగా, తలుపు తీసి ఉంది. లోపల వెంకటనారాయణశాస్త్రి, నాగరత్నమ్మ రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కొన ఊపిరితో ఉన్న దంపతులు ఇద్దర్నీ తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి గుంటూరు సమగ్ర వైద్యశాలకు వైద్యులు పంపారు.

ఘటన జరిగిన నాటి నుంచి దంపతులిరువురూ కోమాలో ఉన్నారు. దీంతో  మెరుగైన వైద్యం కోసం గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలకు మార్చి చికిత్స అందిస్తున్నారు. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో నాగరత్నమ్మ మృతి చెందింది. మృతదేహానికి గుంటూరు సమగ్ర వైద్యశాలలో పోస్ట్‌మార్టమ్ నిర్వహించి, సాయత్రం నాలుగు గంటల ప్రాంతంలో స్వగ్రామం నందివెలుగుకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. దుండుగల దాడిలో గాయపడిన వెంకటనారాయణ శాస్త్రి పరిస్థితి విషమంగా ఉన్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. కళ్లు తెరచి చూడటం మినహా మాట్లాడలేని స్థితిలో ఉన్నట్టు చెప్పారు.
 
పోలీసులకు సవాలుగా మారిన కేసు..
17 రోజులు గడిచినా కేసులో పురోగతి లేదు. దంపతుల్లో ఎవరైనా పూర్తి స్పృహలోకి వచ్చి సమాచారం చెబితే గానీ కేసు ముందుకు కదలని పరిస్థితి. రూరల్ జిల్లా ఎస్పీ నారాయణ్‌నాయక్ ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

గుంటూరు సీసీఎస్ డీఎస్పీ శ్రీనివాసరావును దర్యాప్తు చేసేందుకు నియమించారు. మరో వైపు తెనాలి డీఎస్పీ జీవీ రమణమూర్తి, తాలూకా సీఐ యు. రవిచంద్ర కేసు గురించి ప్రతి రోజు సమీక్షిస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది.  గ్రామంలో బేలుదారి పనికి వచ్చిన వారే చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి, ఈ కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా