తుందుర్రు కన్నెర్ర

20 Oct, 2016 02:01 IST|Sakshi
 ప్రజల ఆకాంక్షలను అణచివేస్తూ.. పాశవిక చర్యలతో జన సంక్షేమాన్ని బలిపీఠం ఎక్కించిన సర్కారు తీరుపై తుందుర్రు ప్రజలు కన్నెర్రచేశారు. రెండున్నరేళ్లుగా ఆక్వా ఫుడ్‌పార్క్‌ను వ్యతిరేకిస్తున్న వారు తమ ఆవేదనను వెళ్లగక్కారు. తమకు బాసటగా నిలిచిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. కాలుష్య కోరలు చాచిన విష రక్కసి ఫుడ్‌పార్క్‌ అని, దీనిని సాగర తీరానికి తరలించాలని, లేకుంటే సర్కారునే బంగాళాఖాతంలో కలిపేస్తామని వై.ఎస్‌.జగన్‌ అల్టిమేటం ఇచ్చారు. తమ పక్షాన నిలిచిన జననేతకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. 
 
నన్నెందుకు అరెస్ట్‌ చేశారో తెలీదు
తణుకు : ‘మా గ్రామాల్లో జరుగుతున్న అన్యాయాన్ని నా పెద్ద కొడుకుగా మీకు తెలియజేయాలనుకున్నా.  ఈ పరిస్థితుల్లో నా దగ్గరకు మీరే వస్తారని అనుకోలేదు. నన్ను ఎందుకు అరెస్టు చేశారో తెలీదు. కాలుష్యకారకంగా మారుతుందని గోదావరి మెగా ఆక్వాఫుడ్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నామనే నెపంతో నన్ను, నా కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. నా కొడుకును నరసాపురం సబ్‌జైలులో ఉంచితే.. నన్ను తణుకు సబ్‌జైలులో పెట్టారు. 36 రోజులుగా జైలులోనే ఉన్నా.  నాభర్తకు క్యాన్సర్‌. ఇంటి వద్ద ఆయనకు కనీసం అన్నం పెట్టే దిక్కులేదు.’ అంటూ తుందుర్రు ఆక్వాఫుడ్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ అక్రమంగా అరెస్టయి తణుకు సబ్‌జైలులో ఉన్న ఆరేటి సత్యవతి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. బుధవారం తణుకు సబ్‌జైలులో సత్యవతిని జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. కొద్దిసేపు ఆమెతో మాట్లాడారు. ఆమె తన గోడును జననేత వద్ద వెళ్లబోసుకున్నారు. తమ గ్రామంలో ఎవ్వరినీ రోడ్లపై తిరగనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని, 144 సెక్షన్‌ విధించారని సత్యవతి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పంటలు పండక ఇబ్బందులు పడుతున్నామని, ఫుడ్‌పార్క్‌ నిర్మాణం వల్ల కాలుష్యం ఎక్కువవుతుందని పేర్కొన్నారు. తాము రెండున్నరేళ్లుగా ఆందోళన చేస్తున్నా.. సర్కారు పట్టించుకోవడం లేదని, ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తక్షణమే ఫుడ్‌పార్క్‌ను ఇక్కడి నుంచి తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆమె జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీంతో చలించిన జగన్‌మోహన్‌రెడ్డి తుందుర్రు ఆక్వా ఫుడ్‌పార్క్‌కు వ్యతిరేకంగా పోరాడతామని భరోసా ఇచ్చారు. పార్క్‌ బాధిత గ్రామాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తక్షణమే ఫుడ్‌పార్క్‌ను సముద్ర తీరానికి తరలించేలా ప్రభుత్వంపైనా, యాజమాన్యంపైనా ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు.  జగన్‌మోహన్‌రెడ్డి వెంట ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ మంత్రి కె.పార్థసారథి, కేంద్ర పాలక మండలి సభ్యులు వంక రవీంద్రనాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి వెంకటనాగేశ్వరరావు, నియోజకవర్గ కో–ఆర్డినేటర్లు గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, తానేటి వనిత, సీఈసీ సభ్యులు చీర్ల రాధయ్య, చిర్ల జగ్గిరెడ్డి తదితరులు ఉన్నారు. 
 
నా తల్లిని అన్యాయంగా జైల్లో పెట్టారు
జగన్‌ను కలిసిన సత్యవతి కుమార్తె కళ్యాణి
తణుకు : కాలుష్యం వెదజల్లే కర్మాగారాన్ని వ్యతిరేకించినందుకే తన తల్లి ఆరేటి సత్యవతిపై హత్యాయత్నం కేసు మోపి జైల్లో పెట్టించారని ఆమె కుమార్తె ఆరేటి కళ్యాణి ఆరోపించారు. సత్యవతిని పరామర్శించేందుకు బుధవారం తణుకు సబ్‌జైలుకు వచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు ఆమె ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా జగన్‌తోపాటు సబ్‌జైలులో ఉన్న తన తల్లిని పరామర్శించేందుకు వెళ్లారు. అనంతరం కళ్యాణి విలేకరులతో మాట్లాడుతూ ఒక పక్క నాన్నకు క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, తన సోదరులు, తల్లిని జైల్లో నిర్భంధించి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. 36 రోజులుగా వారు జైల్లోనే మగ్గుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. హైదరాబాద్‌లో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను కూడా కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నామని చెప్పారు. ప్రభుత్వం ఈ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందనే ఆశలు చిగురించాయని ఆమె పేర్కొన్నారు.  
 
 
 

 

మరిన్ని వార్తలు