‘మహా ప్రభో..మా గోడు వినండి’

1 Aug, 2016 19:21 IST|Sakshi

- నిరవధిక సమ్మెలో ఏజీ వర్సిటీ టైమ్‌స్కేల్ ఉద్యోగులు
- రెగ్యులరైజేషన్, హెచ్‌ఆర్‌ఏల ఊసెత్తని ప్రభుత్వం
- డిమాండ్లు పరిష్కరిస్తేనే సమ్మె విరమణ

సాక్షి ప్రతినిధి, తిరుపతి

 ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, దాని అనుబంధ కేంద్రాల్లో పనిచేసే టైమ్‌స్కేల్ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గడచిన నెల రోజులుగా వీరు నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నెల రోజుల్లోగా డిమాండ్లను పరిష్కరిస్తామన్న వర్సిటీ అధికారులు మళ్లీ ఉద్యోగుల ముఖం చూసింది లేదు.

 

దీంతో టైమ్‌స్కేల్ ఉద్యోగులంతా డిమాండ్ల సాధన కోసం రోజుకో పద్దతిలో నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రస్తుతం 900 మంది టైమ్‌స్కేల్ ఉద్యోగులున్నారు. వీరంతా మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉద్యోగాల్లో నియమితులైన వారే. అప్పట్లో మొత్తం 1650 మంది ఉద్యోగాల్లో చేరగా, 2014 నాటికి 900 మంది మాత్రమే ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. మిగతా వారంతా ఉద్యోగ విరమణ చేశారు. ప్రభుత్వం వీరికి మూలవేతనం, డీఏలను మాత్రమే చెల్లిస్తోంది. ఇవి రెండూ కలిపి ఒక్కొక్కరికీ నెలకు రూ. 14 వేల వరకూ అందుతున్నాయి.

 

వీరి నియామకాల సమయంలో హెచ్‌ఆర్‌ఏ, సిటీ అలవెన్సులపై ప్రభుత్వం జీవో ఇచ్చింది. అంతేకాకుండా జీవో నెంబరు 119 కింద వీరి ఉద్యోగాలను కూడా రెగ్యులరైజ్ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. రెండేళ్లుగా వీరి సమస్యలపై స్పందించనే లేదు. ఇప్పటికి పలు మార్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పుల్లారావు, వర్సిటీ రిజిస్ట్రార్ టీవీ సత్యనారాయణలను కలిసిన టైమ్‌స్కేల్ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రాలు అందజేశారు.

 

వారి నుంచి సరైన స్పందన కరువవడంతో గుంటూరులోని వర్సిటీ ప్రధాన కార్యాలయం ఎదుట ఉద్యోగులు నిరవధిక సమ్మెను ప్రారంభించారు. గుంటూరు,తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, అనంతపురం, కడప, కర్నూలుల్లో వర్సిటీ పరిధిలోని టైమ్‌స్కేల్ ఉద్యోగులు రోజుకో విధంగా నిరసనలు, ఆందోళనలు జరుపుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని యూనివర్సిటీ టైమ్‌స్కేల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పీ మురళీ కోరుతున్నారు.

మరిన్ని వార్తలు