తిరునక్షత్ర ఉత్సవ శోభ

26 Apr, 2017 00:30 IST|Sakshi
తిరునక్షత్ర ఉత్సవ శోభ
నరసాపురం రూరల్‌ :  నరసాపురం పట్టణంలోని శ్రీ ఆదికేశవ ఎంబేరు మన్నార్‌స్వామి దేవస్థానం తిరునక్షత్ర ఉత్సవ శోభతో కాంతులీనుతోంది. భక్తిపారవశ్యం ఉప్పొంగుతోంది. 22 నుంచి ప్రారంభమైన రామనుజ సహస్రాబ్ది తిరునక్షత్ర ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. రామానుజ సహస్రాబ్ది జయంత్యుత్సవం నేపథ్యంలో ఈ ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. నిత్యం స్వామికి తిరుమంజనం, లీలా విభూతి ఉత్సవం, పల్లకిలో అగ్రహార ఉత్సవాలు వైభవంగా జరిపిస్తున్నారు. మద్రాసు సమీపంలోని పెరంబదూరులో విరాజిల్లే ఆదికేశవ భాష్యకార స్వామివార్ల ఆలయం తరువాత దేశంలో అంతటి  ప్రాశస్త్యం గల ఆలయం  ఇదే. సుమారు 230 ఏళ్ల క్రితం ఈ ప్రాంతానికి చెందిన పుప్పాల రమణప్ప నాయుడు  ప్రోద్బలంతో అక్కడి సంప్రదాయం ప్రకారం..ఈ ఆలయాన్ని నిర్మించినట్టు అర్చకులు చెబుతున్నారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం  రాజాధిరాజ వాహనంలో స్వామి తిరువీధుల్లో ఊరేగారు. రామానుజాచార్యులు సుందరంగా ముస్తాబయ్యారు. కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది.  ఆలయ కార్యనిర్వహణఅధికారి అరుణ్‌కుమార్, సిబ్బంది బి.శ్రీనివాసరెడ్డి, బి.సుబ్బారావు, కె.వెంకన్న, ఎస్‌.నాగేశ్వరరావు, ఎం.నాగబాబులతో కలిసి  ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.    
 
 
 
మరిన్ని వార్తలు