‘చిరు’ చెమటలు

27 Jul, 2016 06:52 IST|Sakshi
హంపీ మఠంలోకి చొరబడినపుడు సీసీ కెమెరాలో రికార్డయిన చిరుత
♦ తిరుమలలో ఆరు చిరుతల సంచారం
♦ కట్టడి చేయకపోతే తప్పదు మూల్యం 
♦ వేడుక చూస్తున్న టీటీడీ, వైల్డ్‌లైఫ్‌ ఫారెస్ట్‌ విభాగాలు
♦ స్థానికులు, భక్తుల్లో పెరిగిన ఆందోళన 
 
సాక్షి, తిరుమల: తిరుమలలో మొత్తం ఆరు చిరుతలు సంచరిస్తున్నాయి. గతంలో ఒక్కోటిగానే తిరిగేవి. ప్రస్తుతం అవి రెండేసి చొప్పున జట్టుగా కలసికట్టుగా తిరుగుతున్నాయి. ప్రధానంగా గోగర్భం మఠాల నుంచి రింగ్‌రోడ్డు, గ్యాస్‌గోడౌన్‌ మీదుగా స్థానికులు నివాసం ఉండే  బాలాజీ నగర్‌ తూర్పుప్రాంతం నుంచి దివ్యారామం వరకు సంచరిస్తున్నాయి. ఇవే టీటీడీ ఉద్యోగులు నివాసం ఉండే బీటైపు, డీటైపు క్వార్టర్సుల వరకు తిరుగుతున్నాయి. అలాగే జింకలపార్కు నుంచి అవ్వాచారి కోన, అలిపిరి కాలిబాటమార్గం మీదుగా దివ్యారామం, రెండో ఘాట్‌రోడ్డు ద్వారా శ్రీవారి మెట్టు వరకు వస్తున్నాయి.
 
రాత్రి, పగలూ పెరిగిన చిరుతల సంచారం
జూన్‌ మొదటి వారం నుంచి చిరుతల సంచారం మరింత పెరిగింది. తరచూ ఇవి ఏదో ఒకచోట జనం కంట కనబడుతున్నాయి. జూన్‌ 10న అటవీ ప్రాంతంలోని హంపీ మఠంలోకి చిరుత చొరబడింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఆ తర్వాత బాలాజీనగర్, రింగ్‌రోడ్డు, జీఎన్‌సీ టోల్‌గేట్, 56వ మలుపు వద్ద రోజూ పగలూ.. రాత్రి అని తేడా లేకుండా చిరుతలు సంచరిస్తున్నాయి. చిరుతల సంచార తీవ్రతను ఎత్తి చూపే క్రమంలోనే సాక్షి బృందం చిరుతలు సంచిరిస్తున తీరును ఫొటోలు చిత్రీకరించి  ప్రచురించింది. ఆ తర్వాత కూడా ఈనెల 15న స్థానిక కల్యాణవేదికలోకి చిరుత చొరబడింది. దాన్ని చూసిన భక్తులు, పౌరోహిత సంఘం సిబ్బంది వణికిపోయారు. ఇలా చిరుతల్ని ఎక్కడికక్కడ భక్తులు, స్థానికులు సెల్‌ఫోన్లలో బంధిస్తూ ఆ సమాచారాన్ని ఎప్పడికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా బదిలీ చేస్తున్నారు. తాజాగా, సోమవారం రాత్రి నర్సింగ్‌ సదన్‌లోకి చిరుత చొరబడంతో కలకలం రేపింది. ఫలితంగా టీటీడీ యంత్రాంగం కలవరపాటుకు గురైంది. దీంతో ఎప్పుడు ఏ మార్గంలో చిరుత వస్తుందోనని ఇటు టీటీడీ సిబ్బంది, భక్తులతోపాటు స్థానికులు కూడా ఆందోళన చెందుతున్నారు. 
 
నామమాత్రంగానే బోన్ల ఏర్పాటు
చిరుతల సంచారంపై టీటీడీ, వైల్డ్‌లైఫ్‌ ఫారెస్ట్‌ విభాగాలు తిరుమల బాలాజీనగర్‌ ప్రాంతంలో రెండు బోన్లు ఏర్పాటు చేసి చేతులు దులుపేసుకున్నాయి. చిరుతలను బంధించే ఉద్దేశం లేనపుడు బోన్లు ఎందుకు ఏర్పాటు చేసినట్టు? అన్న విషయంపై వారి వద్ద  ఎలాంటి వివరణ లేదు. సంచరించే చిరుతల్ని బంధిస్తే వాటి స్థానంలో కొత్త చిరుతలు చేరుతాయని చెబుతున్నారు. దీనివల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. 
మరిన్ని వార్తలు