తిరుపతి చిన్నారుల ప్రపంచ రికార్డు

1 Sep, 2015 08:46 IST|Sakshi
తిరుపతి చిన్నారుల ప్రపంచ రికార్డు

వండర్, జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో చోటు
 

తిరుచానూరు: తిరుపతికి చెందిన ఇద్దరు చిన్నారులు ప్రపంచ రికార్డులు సొంతం చేసుకున్నారు. వండర్, జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో చోటు సంపాదించారు. సోమవారం తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో వారి ప్రతిభను గుర్తించి వండర్, జీనియర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు పతకాలు, ధ్రువీకరణ పత్రం, జ్ఞాపికలు అందజేశారు. తిరుపతి కెన్నడీనగర్‌కు చెందిన జయకృష్ణారెడ్డి, సింధూరి దంపతుల కుమార్తెలు శ్రీదర్శిని, హన్సినిరెడ్డి తిరుపతిలోని ఎడిఫై పాఠశాలలో ప్లే స్కూల్, రెండో తరగతి చదువుతున్నారు.

 మూడేళ్ల శ్రీదర్శిని ప్రపంచ పటంలోని 7ఖండాలు, 110కిపైగా దేశాలు, వివిధ రంగులను గుర్తించడం, జాతీయ గీతం, శ్లోకాలు, రైమ్స్ వల్లించడం, మొబైల్‌లోని జిగ్జా పజిల్స్‌ను పూరించడం వంటి వాటిలో ప్రతిభ కనబరచి లిటిల్ జీనియస్ అవార్డు సొంతం చేసుకుంది. రెండో తరగతి చదువుతున్న హన్సినిరెడ్డి చెట్లను కాపాడండి-ప్రగతిని సాధించండి అనే నినాదంతో 257మొక్కలు, చెట్ల ఆకులను సేకరించి స్టన్నర్ కిడ్ అవార్డును కైవసం చేసుకుంది.

ప్రపంచ జీనియస్ బుక్స్ ఆఫ్ రికార్డ్సు ఇండియా చీఫ్ బింగి నరేంద్రగౌడ్, ప్రపంచ వండర్ బుక్స్ ఆఫ్ రికార్డ్సు ఏపీ, తెలంగాణ చీఫ్ కో-ఆర్డినేటర్ స్వర్ణశ్రీ వీరి ప్రతిభను గుర్తించి అవార్డులను అందజేశారు. రామిరెడ్డి రాయలసీమ విద్యాసంస్థల అధినేత మన్నెం రామిరెడ్డి, ఎస్వీ మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వాసుదేవరెడ్డి, ఎడిఫై స్కూల్ డెరైక్టర్ పీ.ప్రణీత్, శ్రీపద్మావతి నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రంగనాయకులు, ఎడిఫై ప్రిన్సిపాల్ సత్యలక్ష్మి, టీడీపీ వైద్యవిభాగం రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు