స్ప్రేయర్లను భద్రపర్చండి ఇలా..

15 Aug, 2016 23:38 IST|Sakshi
స్ప్రేయర్లను భద్రపర్చండి ఇలా..
పెద్దవూర : జిల్లాలో అడపాదడపా వర్షాలు పడుతుండడంతో రైతులు పంట చేల ఎదుగుదల కోసం కాంప్లెక్స్‌(అడుగు మందులు) ఎరువులు వేసే పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో పంటచేలకు సోకే చీడ పీడల నివారణ కోసం క్రిమిసంహారక మందులను పిచికారీ చేయాలి. క్రిమిసంహారక మందులను పిచికారీ చేయటానికి గాను రైతులు రకరకాల స్ప్రేయర్లను ఉపయోగిస్తుంటారు. పంటకాలంలో వాటితో పని ముగియగానే అలాగే వదిలేస్తారు. తర్వాత పంట కాలం అవసరం రాగానే స్ప్రేయర్లను మళ్లీ వాడుకలోకి తేవటం పరిపాటిగా మారింది. అప్పుడు స్ప్రేయర్లు పనిచేయక మెకానిక్‌ల వద్దకు పరిగెత్తడం సర్వసాధారణం. డబ్బులు వెచ్చించి రిపేరు చేయడం కన్నా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వృథా ఖర్చులు తగ్గిపోవడంతో పాటు స్ప్రేయర్లు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని చెబుతున్నారు మండల వ్యవసాయ అధికారిణి, మూడ్‌ పార్వతిచౌహాన్‌.
చేతి (హ్యాండ్‌) స్ప్రేయర్ల విషయంలో..
మందుల పిచికారీ పూర్తి కాగానే శుభ్రమైన నాలుగు లీటర్ల మంచినీటిని ట్యాంకులో పోసి నాజిల్‌ ద్వారా బయటకు పంపాలి. తర్వాత స్ప్రేయర్‌ గొట్టం (ఇత్తడి) తీసి దానికి ఇంజిన్‌ ఆయిల్‌ పోసి మళ్లీ బిగించాలి. ఇలా చేస్తే గొట్టం తుప్పు పట్టకుండా ఉంటుంది. బుష్‌లు, రాడ్ల వద్ద ఇంజిన్‌ ఆయిల్‌ పూయడం వలన తుప్పు రాకుండా ఉంటుంది. ఏడాది తర్వాత తీసి వాడినా బాగా పనిచేస్తుంది.
పవర్‌ స్ప్రేయర్‌..
మందుల పిచికారీ సమయం ముగియగానే పవర్‌ స్ప్రేయర్‌ను మంచినీటితో శుభ్రం చేయాలి. ట్యాంకులో పెట్రోల్‌ లేకుండా చూసుకోవాలి. టర్బోరేటర్‌ గిన్నెలోనూ పెట్రోలు లేకుండా చేయాలి. ప్లగ్‌ తీసి శుభ్రంగా పెట్రోలుతో కడగాలి. పిస్టన్‌పై 5, 6 చుక్కల ఇంజిన్‌ ఆయిల్‌ వేసి ప్లగ్‌ను బిగించాలి. ఇలా చేస్తే పిస్టన్‌ పాడైపోకుండా ఉంటుంది. మళ్లీ అవసరం ఉన్నప్పుడు పంప్‌ మొరాయించకుండా వెంటనే స్టార్టవుతుంది.
తైవాన్‌ స్ప్రేయర్లు..
తైవాన్‌ స్ప్రేయర్‌ ట్యాంకులో ఐదు లీటర్ల మంచినీరు పోయాలి. ఇంజిన్‌ స్టార్ట్‌ చేసి నాజిల్‌ ద్వారా బయటకు పంపాలి. ఇలా చేయడం వలన పైపుతోపాటు నాజిల్‌ మలినాలు లేకుండా శుభ్రం అవుతుంది. ట్యాంకులో పెట్రోలు లేకుండా తీయాలి. ప్లగ్‌ను తీసి పిస్టన్‌పై ఐదు చుక్కల ఇంజిన్‌ ఆయిల్‌ వేసి ప్లగ్‌ బిగించాలి. పంపు భాగాలన్నింటిని శుభ్రంగా తుడిచి భద్రపర్చాలి.
హైటెక్‌ స్పేయర్లు..
ట్యాంకులో మూడు లీటర్ల నీటిని పోసి శుభ్రంగా నాజిల్‌ ద్వారా బయటకు పంపి శుభ్ర పర్చాలి. పంపును తలకిందులుగా ఉంచి బుష్‌లు ఉన్నచోట గొట్టం వద్ద ఇంజిన్‌ ఆయిల్‌ చుక్కలు వేసి పూయాలి.
రీచార్జబుల్‌ స్పేయర్లు..
పనులు పూర్తయిన వెంటనే మూడు లీటర్ల నీటిని ట్యాంకులో పోసి బయటకు పంపాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి గంటపాటు చార్జింగ్‌ పెట్టాలి. ఇలా చేయడం వలన బ్యాటరీ డీచార్జ్‌ కాకుండా ఉంటుంది. మరుసటì  యేడాది సైతం మెకానిక్‌ అవసరం లేకుండా పనిచేస్తుంది. అన్నదాతలు ఈ విషయాలను పాటించి తమ పంపు స్ప్రేయర్లను భద్రపర్చుకుంటే ప్రయోజనం ఉంటుంది. 
 
మరిన్ని వార్తలు