‘దేవాదాయ’లో అక్రమాలకు చెక్‌

13 Sep, 2016 21:43 IST|Sakshi
  • దశబంధం చెరువు వ్యవహారం కూడా పరిష్కరిస్తాం
  • ‘సాక్షి’తో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ వెండిదండి శ్రీనివాసరెడ్డి
  • ఒంగోలు కల్చరల్‌: దేవాదాయశాఖ ఆస్తులు ఎవరైనా ఆక్రమించాలని చూస్తే సహించేది లేదని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ వెండిదండి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన “సాక్షి’తో మాట్లాడారు. త్రోవగుంటలోని ఎనిమిది ఎకరాల ధర్మకుంట దేవాదాయశాఖదే అని అయితే కొందరు ఆ స్థలంలో ప్లాట్లు వేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ స్థలానికి సంబంధించి ఉన్నత న్యాయస్థానంలో కేసు కూడా దాఖలైందన్నారు. ధర్మకుంట స్థలం దేవాదాయశాఖదేనని స్పష్టం చేస్తూ 22ఏ 1సీ ప్రకారం ఏ విధమైన క్రయవిక్రయాలు జరగకుండా చూడాలని రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వివరాలు కూడా సమర్పించామని పేర్కొన్నారు. సంతమాగులూరు మండలంలోని 192 ఎకరాల దశబంధం చెరువు కూడా దేవాదాయశాఖదేనని ఆయన స్పష్టం చేశారు. చెరువుపై ప్రతి ఏటా రూ. 25 లక్షల ఆదాయాన్ని కొందరు అనుభవిస్తున్నారన్నారు. మామిళ్లపల్లి, కుందుర్రు గ్రామాలకు సంబంధించిన ఈ చెరువుపై కొందరు పెత్తనం చెలాయిస్తున్నారని, చెరువు దేవాదాయశాఖదేనని సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని వెల్లడించారు. ఒంగోలు కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయ భూముల కేసు త్వరలో విచారణ జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. రెవెన్యూశాఖ పరంగా జరుగుతున్న కొన్ని పొరపాట్లతో సమస్యలు వస్తున్నాయని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. దేవాదాయశాఖకు చెందిన విలువైన ఆస్తులకు సంబంధించి ఎక్కడైనా ఆక్రమణలు చోటుచేసుకుంటే ఆ వివరాలు 94910 00676 నంబర్‌లో తెలియజేయాలని కోరారు.  
>
మరిన్ని వార్తలు