తెలుగు తమ్ముడి సెగ

4 Jun, 2016 12:13 IST|Sakshi
తెలుగు తమ్ముడి సెగ

టీడీపీలో కొరకరాని కొయ్యలా కేఈ ప్రభాకర్
బీసీ కార్డుతో రోడ్డెక్కడంపై మరో వర్గం సీరియస్
ఇప్పటికే అధిష్టానానికి పలువురి ఫిర్యాదు?
ఆయన వెంట నడిచిన నేతలపైనా చర్యలకు డిమాండ్
ఎటూ తేల్చుకోలేకపోతున్న అధిష్టానం
పూర్తి స్థాయి ఆధారాల సేకరణలో నిమగ్నం

 
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలో ఫిర్యాదుల పరంపర మొదలయింది. రాజ్యసభ సీట్ల కేటాయింపు విషయంలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ చేసిన కార్యాలయ ముట్టడి కార్యక్రమం.. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యల విషయంలో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నట్టు సమాచారం. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓ ముఖ్య నాయకుడు రోడ్డెక్కడంతో పాటు పార్టీ కార్యాలయాన్ని ముట్టడించడాన్ని పార్టీలోని మరో వర్గం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిసింది.

ఇందుకోసం కేఈ ప్రభాకర్ మాట్లాడిన వీడియో ఫుటేజీని కూడా ఆధారంగా వారు పంపినట్టు తెలుస్తోంది. అదేవిధంగా కార్యక్రమం నిర్వహించిన కేఈ ప్రభాకర్‌తో పాటు కార్యక్రమంలో పాల్గొన్న ఇతర నేతలపైనా ఫిర్యాదులు వెళ్లినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారంపై ఆ పార్టీ అధిష్టానం ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, తమపై చర్యలు తీసుకునే అవకాశం లేదని.. అదే జరిగితే బీసీ వర్గాలను పార్టీ దూరం చేసుకుంటుందని కేఈ ప్రభాకర్ వర్గం చెబుతోంది. అదేవిధంగా కేఈ ప్రభాకర్ వ్యవహారశైలిపై సొంత అన్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఇచ్చిన కౌంటర్‌పై ఇటువైపు వర్గం ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
 
వ్యతిరేక ముద్ర పడుతుందా?
పార్టీకి వ్యతిరేకంగా బాహాటంగా మాట్లాడినప్పటికీ చర్యలు తీసుకునే విషయంలో మాత్రం అధికార పార్టీ అధిష్టానం ఆలోచనలో పడినట్టు సమాచారం. ఒకవేళ చర్యలు తీసుకుంటే బీసీల గురించి మాట్లాడితే చర్యలు తీసుకుంటారా అని బీసీ సంఘాలు ధ్వజమెత్తే అవకాశం ఉందని అనుమానిస్తోంది. అదేవిధంగా పార్టీకి బీసీ వ్యతిరేక ముద్ర పడుతుందా అని ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, మరోవైపు ఇంత బాహాటంగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా చర్యలు తీసుకోకపోతే పలుచన అయిపోతామేమోననే ఆందోళన కూడా అధిష్టానాన్ని వేధిస్తున్నట్టు వినికిడి. ఇప్పటికే వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చి నెరవేర్చకపోవడంతో జిల్లాలో బలమైన ఈ సామాజిక వర్గంలో తెలుగుదేశం పార్టీపై ఆగ్రహం పెల్లుబుకుతోంది. మరోవైపు కాపుల్లో తమకు జరుగుతున్న అన్యాయం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేఈ ప్రభాకర్‌పై చర్యలు తీసుకోవడం ద్వారా బీసీలోని ఇతర వర్గాలను కూడా దూరం చేసుకుంటే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని అధిష్టానం ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది.
 
 
క్రమంగా దూరం చేద్దాం
కేఈ ప్రభాకర్‌పై నేరుగా చర్యలు తీసుకోలేని పరిస్థితులు ఉన్నందునా.. ఆయన వెంట నడిచిన నేతలను దూరం చేయాలని అధిష్టానం ప్రణాళిక రచించినట్టు సమాచారం. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే గురువారం జరిగిన కార్యక్రమంలో కేఈ ప్రభాకర్‌తో నడిచిన ఇతర నేతలకు రాష్ట్ర పార్టీ నుంచి అక్షింతలు పడినట్టు తెలిసింది. వివిధ పదవుల్లో ఉన్న ఈ నేతలకు భారీగానే క్లాస్ తీసుకున్నట్టు చర్చ జరుగుతోంది. ఉన్న పదవులు పోగొట్టుకోవాలనుకుంటే మీ ఇష్టమని.. పరోక్షంగా పదవులు పోతాయని బెదిరించినట్టు అధికార పార్టీ నేతలే పేర్కొంటున్నారు. తద్వారా క్రమంగా కేఈ ప్రభాకర్‌తో నడిచిన నేతలను దూరం చేసిన తర్వాత.. అదును చూసి వేటు వేద్దామని పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మొత్తం మీద టీజీ వెంకటేష్‌కు తామే సీటు ఇప్పించామంటూ పార్టీ మారిన ఎమ్మెల్యేలు నేరుగా కాకుండా.. ఆర్యవైశ్య సంఘం తరపున ప్రకటనలు విడుదల చేసిన వైనం.. ఆ తర్వాత దీనిపై ఆర్యవైశ్య సంఘాలు ఘాటుగా స్పందించడం.. అనంతరం కేఈ ప్రభాకర్ ఎపిసోడ్‌లను గమనిస్తే అధికార పార్టీలో అసంతృప్తి సెగ ఇప్పట్లో ఆరనట్లే.

>
మరిన్ని వార్తలు