కుట్రలు బహిర్గతం

29 Jul, 2016 23:06 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న ఆరుట్ల దశమంతరెడ్డి
  • జనగామ జిల్లాను అడ్డుకుంటున్నారు
  • కలెక్టర్‌ నివేదిక తప్పుల తడక
  • మాది రెండు వారాల ఉద్యమమేనట..
  • కడియం శ్రీహరి సాక్షిగా ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖ ఎక్కడ?
  • జేఏసీ చైర్మన్‌ ఆరుట్ల దశమంతరెడ్డి 
  • జనగామ : జనగామ జిల్లా కాకుండా అడ్డుకుంటున్న కుట్రలు సమాచార హక్కు చట్టం ద్వారా బట్ట బయలయ్యాయని జేఏసీ చైర్మన్‌ ఆరుట్ల దశమంతరెడ్డి తెలిపారు. పట్టణంలోని విజయ ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా ప్రతిపాదనపై ఆర్టీఏ చట్టం ద్వారా వివరాలు కావాలని కలెక్టర్‌ను కోరగా, 92 పేజీల నివేదిక ఇచ్చారని తెలిపారు. అయితే, అదంతా తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సాక్షిగా ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తాటికొండ రాజయ్య లేఖలతో పాటు మండల, గ్రామ పంచాయతీల తీర్మాన కాపీలను జూన్‌ 16న కలెక్టర్‌ వాకాటి కరుణకు అందజేశామని వివరించారు. ఇప్పుడు సమాచార హక్కు చట్టంతో అందరి కుట్రలు వెలుగు చూశాయన్నారు.
     
    గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఎగిసి పడుతున్న జిల్లా ఉద్యమం సీఎం కేసీఆర్‌ దృష్టికి వెళ్లిందని స్వయాన ఎమ్మెల్యే ఒప్పుకుంటే, రెండు వారాలుగా ఉద్యమం జరుగుతోందని కలెక్టర్‌ నివేదికలో పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. కష్టకాలంలో మొరపెట్టుకోవాల్సిన అధికారే అన్యాయం చేస్తుంటే తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలని దశమంతరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చేర్యాల, మద్దూరు మండలాలను సిద్దిపేట జిల్లాలో, బచ్చన్నపేట, నర్మెట, జనగామ రూరల్, దేవరుప్పుల, లింగాలఘణపురం మండలాలను యాదాద్రి జిల్లాలో కలపాలని ప్రతిపాదనలు పంపించిన కలెక్టర్‌.. జనగామ మున్సిపాలిటీని ఎక్కడ కలుపుతారో పేర్కొనకపోవడంలో మతలబు ఏమిటని ప్రశ్నించారు. 
     
     జిల్లాను అడ్డుకుంటున్న అదృశ్య శక్తులు...
    జనగామ జిల్లా ఏర్పాటును అడ్డుకునేందుకు బలమైన అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయని ఈ నివేదిక చూస్తే అర్థమవుతోందని దశమంతరెడ్డి అన్నారు. చేర్యాల, మద్దూరు మండలాలను సిద్దిపేటలో, మిగతా మండలాలను యాదాద్రిలో కలపాలని ఎవరు ప్రతిపాదించారో బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. జనగామ జిల్లా కాకుంటే ఎమ్మెల్యే, ఎంపీతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. తప్పుల తడకగా ఉన్న ఈ నివేదికలను సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, సీసీఎల్‌ దృష్టికి తీసుకుపోతామని, కొత్త ప్రతిపాదన పంపించాలని కోరుతామని అన్నారు. పట్టణంలో 144 సెక్షన్‌ అమలు చేస్తూ ఉద్యమాన్ని అణచి వేయాలని చూస్తున్నారని, మరో 48 గంటల్లో ఎత్తివేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట జేఏసీ నాయకులు డాక్టర్‌ రాజమౌళి, ఆకుల వేణు, మేడ శ్రీనివాస్, మంగళ్లపల్లి రాజు, ఆకుల సతీష్, పోకల లింగయ్య, ధర్మపురి శ్రీనివాస్, పిట్టల సత్యం, మాజీద్, తీగల సిద్దూగౌడ్, పిట్టల సురేష్, చిన్నం నర్సింహులు, రెడ్డి రత్నాకర్‌ రెడ్డి, వీరస్వామి, ఉడుగుల రమేష్, కిరణ్‌ ఉన్నారు. 
మరిన్ని వార్తలు