2013 భూ సేకరణ చట్టం అమలుకు సిద్ధం

22 Jun, 2016 02:31 IST|Sakshi
2013 భూ సేకరణ చట్టం అమలుకు సిద్ధం

- ‘మల్లన్న’ నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటాం
- మంత్రి హరీశ్‌రావు ప్రకటన
 
 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రైతులు కోరితే 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనిపై నోటిఫికేషన్ ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. గతంలో భూ నిర్వాసితులు కాళ్లకు చెప్పులు అరిగేటట్టు తిరిగే వారని, తండ్రి చనిపోతే కొడుకులు డబ్బుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, అలాంటి ఇబ్బం దులు రావొద్దనే జీవో నెంబర్ 123 తీసుకొచ్చినట్టు మంత్రి చెప్పారు.  జీవో 123 ప్రకారం 2013 భూ సేకరణ చట్టం కంటే ఎక్కువ డబ్బులు ఇస్తామన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు.

ముంపు బాధితులను కాపాడుకోవాలని ప్రభుత్వం ఆలోచనలో ఉందన్నారు. సీఎం కేసీఆర్ కూడా ముంపు బాధితుడే అని, గూడు చెదిరిన పక్షులగోడు ఎలా ఉంటుందో స్వయంగా సీఎం అనుభవించారని చెప్పారు. ముంపు బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. మల్లన్న సాగర్ ముంపు బాధితులకు ఇస్తున్న ప్యాకేజీ దేశంలోనే నెంబర్ వన్ ప్యాకేజి అని హరీశ్ చెప్పారు. ఎకరానికి యావరేజ్‌గా రూ. 6 నుంచి 7.5 లక్షల చొప్పున నష్టపరిహారం వస్తుందని వివరిం చారు. సమస్యను జటిలం చేసి ప్రాజెక్టులు పూర్తి కాకుండా కాంగ్రెస్, టీడీపీలు ప్రయత్నం చేస్తున్నాయని హరీశ్‌రావు ఆరోపించారు. పోలవరం కట్టడానికి చంద్రబాబు ఏకంగా ఏడు మండలాలను ఆంధ్రలో కలుపుకుంటే అక్కడ ఎందుకు దీక్షలు చేయలేదని పరోక్షంగా టీడీపీ నేత రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు