అందరి డిమాండ్లు నెరవేర్చడం అసాధ్యం

2 Sep, 2016 23:04 IST|Sakshi
అందరి డిమాండ్లు నెరవేర్చడం అసాధ్యం

కోట్‌పల్లి మండలం ఏర్పాటుపై మరోసారి సీఎంకు విన్నవిస్తా
ఆసరా ఫింఛన్ల అవకతవకల్లో బాధ్యులపై చర్యలు
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి

తాండూరు: జిల్లాల పునర్విభజనలో భాగంగా అందరి డిమాండ్లను నెరవేర్చడం ప్రభుత్వానికి సాధ్యం కాదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. తాండూరులో శుక్రవారం జరిగిన ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి అభివృద్ధి సంఘం సమావేశానికి మంత్రి హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చేవెళ్లను జిల్లా కేంద్రం, మెయినాబాద్, షాబాద్‌ తదితర ప్రాంతాలను శంషాబాద్‌ జిల్లాలో విలీనం చేయాలని స్థానిక ప్రజలు చేస్తున్న ఆందోళనలపై విలేకరులు మంత్రిని ప్రశ్నించారు. వికారాబాద్‌ జిల్లా కేంద్రం చేయాలని ఎప్పటినుంచో డిమాండ్‌ ఉందని, దీనికి అనుగుణంగా ప్రభుత్వం జిల్లాగా ఏర్పాటు చేసిందన్నారు.

        చేవెళ్లను చేయాలని ప్రజలు కోరడం తప్పు కాదని, అందరి డిమాండ్లను నెరవేర్చడం సాధ్యం కాదన్నారు. కోట్‌పల్లిని మండలంగా చేయాలని మొదట తానే ప్రతిపాదించినట్టు చెప్పారు. 30-35 వేల జనాభా ఉంటే మండలంగా చేయడానికి వీలుందని, కోట్‌పల్లిలో 1 8వేల జనాభా మాత్రమే ఉందన్నారు. మండలం కాకుండా తాను అడ్డుపడ లేదన్నారు. బంట్వారం మండలం నుంచి చుట్టు పక్కల గ్రామాలను కలిపి కోట్‌పల్లిని మండలంగా ఏర్పాటు చేయడానికి మరోసారి సీఎం కేసీఆర్‌కు విన్నవిస్తానన్నారు. తాండూరు మున్సిపాలిటీలో ఆసరా పింఛన్ల అవకతవకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరున్నా తప్పకుండా చర్యలు ఉంటాయన్నారు. పక్కదారి పట్టిన ఫించన్‌ డబ్బులను రికవరీ చేయడంతోపాటు బాధ్యులపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ వ్యవహారంపై సీబీసీఐడీ విచారణకు ప్రభుత్వానికి లేఖ రాస్తానని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కోట్రిక విజయలక్ష్మి ప్రకటించడాన్ని మంత్రి స్వాగతించారు.

>
మరిన్ని వార్తలు