మళ్లీ అత్తెసరు నిధులే

4 Feb, 2017 01:31 IST|Sakshi
మళ్లీ అత్తెసరు నిధులే

 రైల్వేబడ్జెట్‌లో జిల్లాకు  అరకొర కేటాయింపులు
తిరుపతిలో విశ్రాంతి గదికి రూ.7 కోట్లు
తిరుచానూరు స్టేషన్‌ అభివృద్ధికి   రూ.6 కోట్లు


తిరుపతి :  ఊహించిందే జరిగింది. కేంద్ర రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు మళ్లీ అత్తెసరు నిధులే లభించాయి. రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు పంపిన మేజరు ప్రతిపాదనలకు ఆశిం చిన మేర నిధులు మంజూరు కాలేదు. కేవలం తిరుపతి, తిరుచానూరు రైల్వేస్టేషన్లకు మాత్రమే రూ.13 కోట్లు విదిలించారు. జిల్లా రైల్వే ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పనకు మొత్తం రూ. 80 కోట్లు అవసరమన్న రైల్వే ఇంజినీరింగ్‌ అధికారుల తాజా ప్రతిపాదనలను కేంద్రంగా పెద్దగా పట్టించుకోలేదు. రైల్వేమంత్రి మన రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఈసారి తిరుపతికి ఎక్కువ నిధులు దక్కుతాయని ఆశించిన రాజకీయ, ఉద్యోగ వర్గాలకు నిరాశే ఎదురైంది.
 జిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాలకు విశేషముంది. దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్య లో ఇక్కడికి యాత్రికులు వస్తుంటారు. ఈ రెండు స్టేషన్లకు రోజువారీ ఆదాయం కూడా  ఎక్కువ. తిరుపతి రోజువారీ ఆదాయం రూ.40 లక్షలకు పైనే ఉంటుంది. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించాలని అధికారులు ఎప్పటి నుంచో ప్రతిపాదనలు పంపుతున్నారు. దీనికితోడు బాలాజీ రైల్వే డివిజన్‌గా తిరుపతిని ప్రకటించాలన్న ప్రతిపాదనలు 1992 నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. దీనిపై స్పందించని కేంద్రం 2017–18 రైల్వే బడ్జెట్‌లో కేవలం రూ.13 కోట్లతో మమ అనిపించారు.

తిరుపతికి రూ.7 కోట్లు....
ప్రస్తుతం తిరుపతి స్టేషన్‌లో రెండు జనరల్‌ వెయిటింగ్‌ హాళ్లు, రెండు ఏసీ వెయిటింగ్‌ హాళ్లు మాత్రమే ఉన్నాయి. ఇవి ప్రయాణికుల అవసరాలకు ఏమాత్రమూ చాలడం లేదు. దీన్ని గుర్తించిన కేంద్రం మరో విశ్రాంతి హాలు కోసం తాజా బడ్జెట్‌లో రూ.7 కోట్లు కేటాయించింది. అదేవిధంగా తిరుచానూరు స్టేషన్‌ అభివృద్ధి కోసం రూ.6 కోట్లు కేటాయించింది. ఇదే స్టేషన్‌కు కిందటి బడ్జెట్‌లో రూ.10 కోట్లు కేటాయించినప్పటికీ పూర్తిస్థాయి రైల్వేస్టేషన్‌ అభివృద్ధి కోసం ఇంజినీరింగ్‌ ఉన్నతాధికారులు తాజాగా రూ.25 కోట్ల అంచనాతో ప్రతిపాదనలను రైల్వేబోర్డుకు పంపారు. అయితే కేవలం రూ.6 కోట్లు మాత్రమే దక్కాయి.

నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైనుకు రూ.340 కోట్లు
ఈసారి మాత్రం నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైను పనులకు కాస్త కేటాయింపులు పెంచారు. రూ.340 కోట్లు కేటాయించారు. 309 కిలోమీటర్ల నిడివి గల నూతన రైల్వే మార్గం నిర్మాణానికి మొత్తం రూ.1313 కోట్లు అవసరమని 2011–12లో అంచనా వేశారు. కాగా కిందటి బడ్జెట్‌లో రూ.10 కోట్లు కేటాయించారు.

 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా