‘కాకినాడ’ పీఠం కైవసమే లక్ష్యం

22 Sep, 2016 00:10 IST|Sakshi
‘కాకినాడ’ పీఠం కైవసమే లక్ష్యం
అధికార పార్టీ వైఫల్యాల్నీ, వంచననూ ఎండగట్టాలి
మెజారిటీ డివిజన్లూ, మేయర్‌ స్థానమూ గెలవాలి
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు నేతల పిలుపు
 
కాకినాడ: రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో మెజారిటీ డివిజన్లలో గెలుపుతో పాటు మేయర్‌ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయాలని వైఎస్సార్‌ సీపీ కార్పొరేషన్‌ ఎన్నికల పరిశీలకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో కార్పొరేషన్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అధ్యక్షతన బుధవారం జరిగింది. ముఖ్యఅతిథిగా బొత్స మాట్లాడుతూ ప్రజలకిచ్చిన హామీలను రెండేళ్ళ పాలనలో తుంగలో తొక్కి, ప్రత్యేక హోదా విషయంలో దగా చేసిన తెలుగుదేశం, బీజేపీ వైఫల్యాలను ఇంటింటా ప్రచారం చేయాలన్నారు. టీడీపీ అరాచకాలను ధైర్యంగా ఎదుర్కోవడంతో పాటు ఐకమత్యంతో పనిచేసి మంచి ఫలితాలను సాధించాలని కోరారు. 
సమర్థులే అభ్యర్థులు : ధర్మాన
పార్టీ జిల్లా పరిశీలకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ కార్పొరేషన్‌ ఎన్నికల్లో సమర్థులైన అభ్యర్థులను సర్వేలు, ఇతర అంశాల ప్రాతిపదికగా ఎంపిక చేస్తారని స్పష్టం చేశారు. అభ్యర్థి గుణగణాలతోపాటు ప్రజలతో ఉండే సత్సంబంధాలను పరిగణనలోకి తీసుకుంటారన్నారు. మరో పరిశీలకుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని శత్రువుగా చూసే ధోరణిలో  పాలన సాగిస్తున్న చంద్రబాబు హయాంలో ఎన్నికలు యుద్ధంలా జరుగుతున్నాయని, కేడర్‌ సైనికుల్లా పనిచేయాల్సి అవసరం ఉందని చెప్పారు. జన్మభూమి కమిటీల ద్వారా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీట్‌ లెవెల్‌లో పార్టీ శ్రేణులతో కమిటీలు వేయాలన్నారు. మరో ఎన్నికల పరిశీలకుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ మాట్లాడుతూ పార్టీ నేతలు ఐక్యతతో పనిచే సి ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని సూచించారు. 
‘స్మార్ట్‌ సిటీ’ ప్రచారార్భాటమే : కన్నబాబు
పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు మాట్లాడుతూ స్మార్ట్‌ సిటీ ద్వారా రూ.386 కోట్లు విడుదలైనట్టు గొప్పలు చెబుతూ ఇప్పటి వరకు పట్టుమని రూ.2 కోట్లు నిధులు ఖర్చు చేయలేదని విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికొదిలిన టీడీపీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడంతో పాటు పార్టీ విధానాలను విస్తృతంగా ప్రచారం చేసి గెలుపుబాట పట్టాలన్నారు. మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల ద్వారా అధికార పార్టీకి ఎక్స్‌ అఫిషియో సభ్యులున్నందున కనీసం 35 స్థానాల్లో గెలుపును లక్ష్యంగా భావించాలన్నారు.  కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ చలమలశెట్టి సునీల్‌ మాట్లాడుతూ ప్రత్యేక హోదాతోపాటు ఇతర వైఫల్యాలను, స్మార్ట్‌సిటీ పేరుతో అభివృద్ధికి ఆమడదూరంగా ఉన్న విధానాలను ఇంటింటికీ తిరిగి విస్తృత ప్రచారం చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా మేయర్‌ పీఠాన్ని జగన్‌కు బహుమతిగా ఇద్దామని  పిలుపునిచ్చారు.   కాకినాడ సిటీ కో ఆర్డినేటర్‌ ముత్తా శశిధర్‌ మాట్లాడుతూ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకోగలమనే ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్‌ కుమార్‌ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, జన్మభూమి కమిటీ అరాచకాలు పెరిగిపోయాయన్నారు. 
అమర జవాన్లకు నివాళి
 ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఎలా పనిచేయాలనే అంశంపై పార్టీ శ్రేణులకు నేతలు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు స్వాగతం పలుకగా, రాష్ట్ర కార్యదర్శి కర్రి నారాయణరావు, మాజీ డిప్యూటీ మేయర్‌ పసుపులేటి వెంకటలక్ష్మి, కాకినాడ నగర ఎస్సీ, మైనార్టీ సెల్‌ అధ్యక్షులు సునీల్, అక్బర్‌ అజామ్‌ తదితరులు ప్రసంగించారు. తొలుత మహానేత వైఎస్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన జవాన్‌లకు నివాళులర్పిస్తూ శశిధర్‌ తీర్మానం ప్రవేశపెట్టగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. పార్టీ పెద్దాపురం, జగ్గంపేట కో ఆర్డినేటర్లు తోట సుబ్బారావునాయుడు, ముత్యాల శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు, జిల్లా ప్రధాన కార్యదర్శులు అత్తిలి సీతారామస్వామి, మట్టా సుజాత, రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్, జిల్లా మైనార్టీసెల్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ బషీరుద్దీన్, రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శులు బొబ్బిలి గోవిందు, అల్లి రాజబాబు, మీసాల దుర్గాప్రసాద్, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి పెద్దిరెడ్డి రామలక్ష్మి, రాష్ట్ర యువజన విభాగం సభ్యుడు వాసిరెడ్డి జమీలు, పలువురు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు