పుస్తకం...వెన్నంటి వచ్చే నేస్తం

12 Dec, 2016 15:17 IST|Sakshi
పుస్తకం...వెన్నంటి వచ్చే నేస్తం
కష్టాల్లో ఓ దారుస్తుంది
ఆత్మీయతను పంచుతుంది
నేటితో ముగియనున్న పుస్తక సంబరాలు
రాజమహేంద్రవరం కల్చరల్‌ : పుస్తకం... ప్రతి ఒక్కరికి వెన్నంటి వచ్చే నేస్తం. ఓ మంచి పుస్తకం కష్ట సమయంలో ఓదారుస్తుంది. మనసుకు సాంత్వన చేకూరుస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఆత్మీయతను పంచుతుంది. ఆనంద సమయంలో మరింత ఆహ్లాదం కలిగిస్తుంది. అలాంటి అద్భుత పుస్తకాల సమాహారంగా రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్‌కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బుక్‌ ఎగ్జిబిషన్‌ పుస్తక ప్రియుల మదిని దోచుకుంటోంది. నవ్యాంధ్ర పుస్తక సంబరాలు ఆదివారంతో ముగియనున్నాయి. మొదట్లో అంతంత మాత్రంగానే సందర్శకులు ఈ ప్రదర్శనను తిలకించినా, రెండు రోజులుగా వీరి సంఖ్య పెరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఆదివారం మరింతగా పుస్తకాల అమ్మకాలు పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  
ఆధునిక ప్రాచీన సాహిత్యాలు...
మైదానంలోని 20, 21, 22, 23, 24 నంబరు స్టాళ్లలో ఉన్న ఎమెస్కోలో వైవిధ్యభరితమైన పుస్తకాలు ఉన్నాయి. పి.వి.నరసింహారావు ‘లోపలి మనిషి’, టంగుటూరి ప్రకాశం ‘స్వీయచరిత్ర,’, నారా చంద్రబాబు నాయుడి ‘మనసులో మాట’ ఇక్కడ పది శాతం డిసౌంట్‌లో లభిస్తున్నాయి. కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీమహాస్వామి ఉపదేశాలు ‘అమృతవాణి’ పేరిట లభిస్తున్నాయి. దాశరథి, గాలిబ్‌ గీతాలు, బి.వి.ఎస్‌.రామారావు గోదావరి కథలు, అడవి బాపిరాజు నవలలు, వడ్డెర చండీదాస్‌ హిమజ్వాల, శ్రీశ్రీ అనంతం కథలు, అమరావతి కథలు, బాలసాహిత్యం..ఇలా ఎన్నో ఎన్నో పుస్తకాలు, ప్రాచీన, ఆధునిక సాహిత్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
విప్లవ శంఖం ఇదిగో..
నవ్యాంధ్ర సంబరాలు, స్టాల్‌ నంబరు 70, ‘విరసం’ స్టాలులో విప్లవ, వామ పక్షభావాలకు చెందిన సాహితీ గ్రంథాలు లభిస్తున్నాయి. దిగంబర కవులు, రావిశాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావుల రచనలు ఇక్కడ ఉన్నాయి. కథక చక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి నిర్వహించిన ప్రబుద్ధాంధ్ర పత్రికలను గ్రంథరూపంలో ఇక్కడ చూడవచ్చు. డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌ ఈ సంకలనానికి సంపాదకత్వం వహించారు.
నేటికీ పుస్తకాలపై ఆసక్తి
పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో అన్ని రంగాలు అంతో, ఇంతో దెబ్బతిన్నాయి. పుస్తకాల పట్ల పాఠకుల్లో నేటికీ ఆసక్తి ఉంది. ఈ స్టాళ్ళను సందర్శించడం వల్ల​ఏ పుస్తకం ఎక్కడ లభిస్తుంది అన్న విషయంపై అవగాహన కలుగుతుంది.
- జి.జనార్దన్, ఎమెస్కో నిర్వాహకుడు
ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేవు 
నవ్యాంధ్ర పుస్తక సంబరాలలో అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. కారణాలు అందరికీ తెలిసినవే. తరుచుగా ఇటువంటి ప్రదర్శనలను నిర్వహించాల్సిన అవసరం ఎంతయినా ఉంది.  
- అరసవిల్లి కృష్ణ, విరసం కార్యవర్గ సభ్యుడు
మరిన్ని వార్తలు