నిజామాబాద్ జిల్లాకు నేడు సీఎం

1 Apr, 2016 02:50 IST|Sakshi
నిజామాబాద్ జిల్లాకు నేడు సీఎం

ఇందూరు నుంచే బస్సుయాత్రకు శ్రీకారం
నేడు, రేపు రెండు రోజులు జిల్లాలో పర్యటన

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిజామాబాద్ జిల్లా నుంచి బస్సుయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం జిల్లాల్లో బస్సుయాత్ర చేయనున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్... శుక్రవారం మధ్యాహ్నమే జిల్లాకేంద్రానికి చేరుకుని, నిజామాబాద్ మండలం నర్సింగ్‌పల్లిలో శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయలు దేరి మాక్లూరు మండల కేంద్రంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త నూతన గృహ ప్రవేశం కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకోనున్న సీఎం, ఆయన కుమార్తె నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇంటికి వెళ్లి అరగంట అక్కడే గడపనున్నారు.

అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కరువు పరిస్థితులు, తాగునీటి ఎద్దడిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సమీక్ష తర్వాత బాన్సువాడకు వెళ్లి అక్కడ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో రాత్రి బస చేస్తారు. శనివారం ఉదయం బీర్కూరు మండలం తిమ్మాపూర్ గుట్టలపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన తెలంగాణ తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించి సీఎం కేసీఆర్ పూజలు చేయనున్నారు. అక్కడి నుంచి బయలుదేరి మెదక్ జిల్లా ఎర్రపల్లికి చేరుకుంటారు. సీఎం కేసీఆర్ రెండు రోజుల పర్యటన సందర్భంగా అధికారయంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. 

మరిన్ని వార్తలు