ప్రతి ఏటా ఇబ్బందే

29 Aug, 2017 22:57 IST|Sakshi
ప్రతి ఏటా ఇబ్బందే

– ఆరుతడి పంటల సాగుకూ కటకటే
– తీవ్రంగా నష్టపోతున్న అనంత ఆయకట్టు రైతులు
– అసలు విషయాన్ని గుర్తించడంలో ప్రజాప్రతినిధుల వైఫల్యం
– నేడు సాగునీటి సలహా మండలి సమావేశం


అనంతపురం సెంట్రల్‌: తుంగభద్ర జలాశయానికి చేరుతున్న నీటిని కర్ణాటక ప్రాంత ప్రజలకు ఉపయోగపడేలా ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపింది. దీని కోసం అనంత ఆయకట్టు రైతులు, ప్రజల ప్రయోజనాలను తొక్కి పెడుతోంది. న్యాయబద్ధంగా మనకు రావాల్సిన నీటిని రాబట్టుకోవడంలో జిల్లా ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారు. జలాశయంలో 60 టీఎంసీలకు పైగా నీరున్నా ఇంట వరకూ జిల్లాకు చుక్క నీరు విడుదల కాలేదు. ఇప్పటికే జిల్లాలో తాగునీటి ఇబ్బందులు పెరిగిపోయాయి. చిత్రావతి ఒట్టిపోవడంతో జిల్లాలోని ధర్మవరం,  కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాలతోపాటు వైఎస్సార్‌ జిల్లాలోని పులివెందుల ప్రాంతాల ప్రజలు దాహార్తీతో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం బుధవారం మధ్యాహ్నం స్థానిక రెవెన్యూ భవన్‌లో జరగనుంది.

పూడిక పేరుతో అన్యాయం
అనంతపురం, కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాలకు ప్రధాన నీటి వనరుగా ఉన్న తుంగభద్ర జలాశయం నుంచి అరకొర నీటిని విడుదల చేస్తుండడంతో నీటి పంపిణీలో న్యాయం చేకూరడం లేదు. ప్రాజెక్ట్‌ కర్ణాటకలో ఉండడం వల్ల ఆ ప్రాంత రైతులకు ఎక్కువ శాతం లబ్ధి చేకూరుతోంది. జలాశయం ద్వారా హెచ్చెల్సీకి 32.05 టీఎంసీల నీరు అందాల్సి ఉంది. అయితే జలాశయంలో పూడిక చేరిక, ఉపరితల ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు సాకుగా చూపుతూ నీటి కేటాయింపుల్లో కర్ణాటక ప్రభుత్వం భారీగా కోత పెడుతోంది. సగటున 22 టీఎంసీల నీరు కూడా జిల్లాకు అందకుండా పోతోంది.  ఫలితంగా జిల్లాలో హెచ్చెల్సీ ఆయకట్టు నానాటికీ తీసికట్టులా మారుతోంది. 1.80 లక్షల ఎకరాల ఆయకట్టులో 50 వేల ఎకరాలు కూడా సాగుకు నోచుకోవడం లేదు.

20 రోజులు మాత్రమే నీటి విడుదల
హెచ్చెల్సీ ప్రధాన కాలువ కర్ణాటకలో 100 కిలోమీటర్ల మేర ఉంది. 105 కిలోమీటర్‌ వద్ద జిల్లాలోకి అడుగుపెడుతుంది.  జలాశయంలో 40 టీఎంసీల సామర్థ్యం దాటితో నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తుంటారు. ఏటా జూన్‌, జులైలో నీటి విడుదల జరుగుతుండేది.  ఈ సారి మాత్రం ఆగస్టు ముగుస్తున్నా నీళ్లు విడుదల చేయలేదు. తాజాగా ఆరుతడి పంటలు సాగు చేయడానికి సీజన్‌ దగ్గర పడడంతో బుధవారం నుంచి నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్దతిలో జలాశయం నుంచి  జిల్లాకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు సమాచారం అందించారు. అయితే  ఇది కూడా కేవలం 20 రోజులు మాత్రమే నీటి విడుదల ఉంటుందని తేల్చి చెప్పారు.  కర్ణాటక ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాల వల్ల జిల్లా ప్రజలు తీవ్రంగా నష్టపోనున్నారు.

రెండేళ్లుగా బీళ్లు
నీళ్లుంటే బంగారు పంటలు పండే ఆయకట్టు భూములు రెండేళ్లుగా బీళ్లు పడ్డాయి. కనీసం ఆరుతడి పంటలు కూడా పండించుకోలేని దుస్థితి నెలకొంది. ప్రతి ఏటా ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా నీటి విడుదల చేయాలని టీబీబోర్డు అధికారులను జిల్లా అధికారులు కోరడం.. వారు పెడచెవిన పెట్టడం పరిపాటిగా మారుతోంది. దీనికి తోడు కర్ణాటకలోని హెచ్చెల్సీ ప్రధాన కాలువ 100 కిలోమీటర్లు మేర ఆ రాష్ట్ర రైతుల జలచౌర్యానికి అడ్డు లేకుండా పోతోంది.   
 
ఐదేళ్లలో హెచ్చెల్సీకి వచ్చిన నీళ్లు :
సంవత్సరం        వచ్చిన నీళ్లు (టీఎంసీలలో)    
2012–13        19.247    
2013–14        26.455    
2014–15        22.520    
2015–16        16.997    
2016–17        10.327    (ఇప్పటి వరకు)

మరిన్ని వార్తలు