బాబోయ్.. బూచాళ్లు!

25 May, 2016 01:38 IST|Sakshi
బాబోయ్.. బూచాళ్లు!

మూడున్నరేళ్లలో 611 మంది అదృశ్యం
33 మంది చిన్నారుల ఆచూకీ గల్లంతు
పట్టించుకోని పోలీసులు
తీరని బాధితుల కన్నీటి వ్యథ
నేడు చిల్డ్రన్స్ మిస్సింగ్ డే

కళ్లముందు ఉండే పిల్లలు కనిపించకుండా పోతే ఆ బాధ చెప్పలేనిది. తప్పిపోయిన వారు దొరుకుతారో లేదో తెలియదు. అసలు ఏమయ్యారో... వారి ఆచూకీ చిక్కదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం పడే మనోవేదన అంతా ఇంతా కాదు. జిల్లాలో నిత్యం ఏదో ఒక మూల అదృశ్యం కేసులు నమోదవుతూనే ఉన్నాయి. పిల్లలు కన్పించకుండా పోగానే తల్లిదండ్రుల గుండెలు జారిపోతాయి. బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీసినా ఆచూకీ దొరక్కపోతే ప్రాణాలు తోడేసినంత పనవుతుంది. చివరి ప్రయత్నంగా పోలీసులకు సమాచారమిస్తారు. వారి ప్రయత్నంలో దొరికితే ఆనందం.. దొరక్కపోతే నరకమే. బుధవారం ప్రపంచ చిల్డ్‌న్స్ మిస్సింగ్ డే సందర్భంగా ప్రత్యేక కథనం...

 సిద్దిపేట రూరల్: చిన్నారులు అదృశ్యమవుతున్న కేసులు జిల్లాలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో 18 ఏళ్లలోపు వయస్సు గల బాలబాలికలు ఎక్కువగా అదృశ్యమవుతున్నారు. ఇందులో కొందరి ఆచూకీ లభించగా మరికొందరి చిన్నారుల ఆచూకీ లేకుండా పోయింది. జిల్లా లో గడిచిన మూడున్నర ఏళ్లలో 611 మంది బాలబాలికలు అదృశ్యమయ్యారు. ఇందులో 576మందిని గుర్తించిన పోలీసులు సదరు కుటుంబాలకు అప్పగించారు. మిగతా 35మంది బాలబాలికల ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో అదృశ్యమైన పిల్లల కుటుంబాలు శోకసముద్రంలోనే ఉండిపోయాయి.

చిన్నారులు తప్పిపోవడంతో  సదరు కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంటుంది. అలాంటి వారు గంపెడాశతో పోలీస్ స్టేషన్‌ల మెట్లు ఎక్కుతారు. ఇలా పరిస్థితుల్లో ఫిర్యాదు చేసుకునే పోలీసులు ‘చూద్దాం... ప్రయత్నిస్తాం’... అనే సమాధానం తప్ప బాధితులకు గట్టి భరోసా లేకుండా పోతోంది. అదృశ్యమైన వారు ఎప్పుడొస్తారా? అని బాధితులు  కళ్లల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తుంటారు. పిల్లలు ఎక్కడికి వెళ్లారో తెలియక ఆందోళన చెందుతారు. ఇలాంటి కేసుల దర్యాప్తులో  మొదటి ప్రధాన్యతనిచ్చి వాటిని త్వరిత గతిన పరిష్కరిస్తే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు.

అదృశ్యమైన పిల్లల ఆచూకీ 24 గంటల్లో లభ్యం కాకపోతే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాల్సి ఉంటుంది. దీనిపై సంబంధిత పిల్లల ఫొటో, పూర్తి వివరాలను పత్రికల్లో ప్రచురణ కోసం పోలీసులు ప్రకటన విడుదల చేయాలి. కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ సిబ్బంది అనుమానిత ప్రదేశాలకు వెళ్లి ఆచూకీ కోసం వెతకాలి. కానీ అలా జరగడం లేదు. పత్రిక ప్రకటనలతోనే పోలీసులు సరిపెడుతున్నారని ఆరోపణలున్నాయి.

 కానరాని ప్రత్యేక బృందాలు...
జిల్లాలో పిల్లల అదృశ్యం కేసులు పెరుగుతున్నాయి. కేసుల దర్యాప్తు కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి. కానీ ఆ బృందాలు ఎక్కడున్నాయో?, ఎక్కడ పని చేస్తున్నాయో?, ఎన్ని కేసులు ఛేదించాయో? మాత్రం తెలియదు. జిల్లాలో దర్యాప్తు బృందాలున్నాయనే విషయం పోలీసులకు తెలియకుండా ఉంది. ఇప్పటికైనా సక్రమంగా దర్యాప్తు చేయాలని బాధితులు కోరుతున్నారు. ఏటా మిస్సింగ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

 ఇప్పటికీ దొరకని పిల్లల ఆచూకీ...
జిల్లా పోలీసుల రికార్డుల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నెల 30వరకు 66 మంది పిల్లలు అదృశ్యమయ్యారు. ఇందులో 51మంది ఆచూకీ లభ్యం కాగా, మరో 15మంది బాలబాలికలు మిస్సింగ్ మిస్టరీగా ఉండిపోయింది. ఇందులో బాలురు 3, బాలికలు 13 మంది ఆచూకీ దొరకలేదు. అదే విధంగా 2013లో బాలురు 4, బాలికలు 4, 2014లో బాలురు 4, బాలికలు 3, 2015లో బాలురు 2, బాలికలు ముగ్గురి ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు.

మిస్సింగ్ కేసులు చాలా తక్కువ..
చిన్నారులు అదృశ్యం కావడం జిల్లాలో చాలా తక్కువ. అక్కడక్కడా అదృశ్యమైనట్టు కేసులు నమోదవుతున్నాయి. విచారణ జరిపి వెంటనే పట్టుకుంటున్నాం. పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు తల్లిదండ్రులకు సమాచారం ఉండాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే మేలు. - ఎన్.వెంకటేశ్వర్లు, డీఎస్పీ తూప్రాన్

 సిద్దిపేటలో  బాలుడి అదృశ్యం
సిద్దిపేట క్రైం: అమ్మ తిట్టిందని బయటకు వెళ్లిన బాలుడి తిరిగి ఇంటికి రాలేదు. తల్లి ఫిర్యాదు మేరకు మంగళవారం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... పట్టణ పరిధిలోని నర్సాపూర్ చౌరస్తా ప్రాంతానికి చెందిన సుగుందం శ్రావణ్‌కుమార్(16) పారుపల్లి వీధిలో 9వ తరగతి చదువుతున్నాడు. సెలవులు రావడంతో శ్రావణ్‌కుమార్ బయట తిరుగుతున్నాడు. ఈ క్రమంలో తల్లి భవానీ ఈనెల 20న మందలించింది. మనస్తాపం చెందిన ఆ బాలుడు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు, అతని స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. బాలుడి తల్లి భవాని ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు సీఐ సైదులు తెలిపారు.

మరిన్ని వార్తలు