తుమ్మిడిహెట్టి ఎత్తుపై నేడు మహారాష్ట్రతో చర్చలు

26 Oct, 2015 02:34 IST|Sakshi
తుమ్మిడిహెట్టి ఎత్తుపై నేడు మహారాష్ట్రతో చర్చలు

సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల సాగునీటి ప్రాజెక్టులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించనున్న బ్యారేజీ ఎత్తుపై మహారాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులతో తెలంగాణ అధికారులు సోమవారం మరోమారు చర్చలు జరపనున్నారు. ఈ చర్చల్లో మహారాష్ట్ర వెల్లడించే అభిప్రాయాల మేరకు బ్యారేజీ ఎత్తుపై తుది నిర్ణయానికి రానున్నారు. తుమ్మిడిహెట్టి ఎత్తుపై చర్చలకు రావాలని కోరుతూ ప్రాణహిత చీఫ్ ఇంజనీర్ హరిరామ్, మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ప్రాంత చీఫ్ ఇంజనీర్ ఆర్.ఎం.చవాన్‌కు గతంలోనే లేఖ రాశారు. ఈ లేఖకు స్పందించిన మహారాష్ట్ర అధికారులు సోమవారం రాష్ట్రానికి వస్తున్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు 152 మీటర్ల మేర  ఉంటే తమ భూభాగంలో 1,850 ఎకరాల వరకు ముంపు ఉన్న దృష్ట్యా దాన్ని తగ్గించాలని మహారాష్ట్ర కోరుతోంది.
 
 ఎత్తును 148 మీటర్లకు తగ్గించాలని అంటోంది. దీంతో చేసేది లేక రాష్ట్రం తుమ్మిడిహెట్టి నుంచి కాకుండా నిర్ణీత నీటిని మేడిగడ్డ ప్రాంతం నుంచి తీసుకునే అంశమై పరిశీలనలు జరుపుతోంది. అయితే ఆదిలాబాద్ జిల్లా సాగు అవసరాల నిమిత్తం తుమ్మిడిహెట్టి బ్యారేజీని తక్కువ ఎత్తులో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈ ఎత్తు ఎంత, బ్యారేజీ సామర్ధ్యం ఏమాత్రం అన్నదానిపై మాత్రం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. బ్యారేజీ ఎత్తుపై మహారాష్ట్ర అభిప్రాయాలను అధికారికంగా తెలుసుకున్నాకే దీనిపై ఓ నిర్ణయానికి రావాలని భావిస్తోంది.
 
 నెలాఖరుతో మూసుకోనున్న బాబ్లీ గేట్లు..
 గోదావరి నదిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్ర నిర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఈ నెల 29 నుంచి మూసుకోనున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గేట్లు తెరిచి ఉంచేందుకు విధించిన గడువు ఈ నెల 28తో ముగియనున్న నేపథ్యంలో మరుసటి రోజు గేట్లు మూసి నీటిని నిల్వ చేసుకునేందుకు మహారాష్ట్ర సమాయత్తం అవుతోంది. ఉత్తర తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో 7లక్షల ఎకరాలకు ప్రధాన నీటి వనరుగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలరాకను అడ్డుకునే బాబ్లీ ప్రాజెక్టుపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు తన తీర్పును వెలువరించింది.

దీని ప్రకారం ఏటా జూలై ఒకటిన ప్రాజెక్టు గేట్లు తెరిచి అక్టోబర్ 28 వరకు నదీ సహజ ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలని మహారాష్ట్రను ఆదేశించింది. అక్టోబర్ 29 నుంచి మరుసటి ఏడాది జూన్ 30 వరకు ప్రాజెక్టు గేట్లు మూసి ఉంచాలని సూచించింది. ఈ ఆదేశాల మేరకు మహారాష్ట్ర జూలై ఒకటిన ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి నీరు దిగువకు వచ్చే ఏర్పాట్లు చేసింది. అయితే గోదావరి బేసిన్‌లో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా శ్రీరాంసాగర్‌లోకి పెద్దగా ప్రవాహాలు రాలేదు. ఈ నేపథ్యంలో నేటి సమావేశంలో గేట్ల మూసివేతపైనా చర్చించే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు