ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్‌

12 Feb, 2017 21:36 IST|Sakshi
–20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ
– 21న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు 23వ తేదీ ఆఖరు
– మార్చి 9న పోలింగ్, 15న ఓట్ల లెక్కింపు
 
అనంతపురం అర్బన్‌: పశ్చిమ రాయలసీమ (అనంతపురం, వైఎస్సార్, కర్నూలు) పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలకు  ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ శశిధర్‌ సోమవారం ఎన్నికల నోటిఫికేషన్‌ని విడుదల చేస్తారు. అభ్యర్థులు సోమవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 21వ తేదీన నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 23 చివరి గడువుగా విధించారు. మార్చి 9న పోలింగ్, 15న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎన్నికలకు సంబంధించిన నియమ, నిబంధనలు, ప్రవర్తనా నియమావళిని కలెక్టర్‌ శశిధర్‌ ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేశారు.
 
నామినేషన్ల దాఖలు ఇలా..
అభ్యర్థులు ఉదయం 11 గంటల నుంచి 3 గంటలలోపు నామినేషన్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత వచ్చే నామినేషన్లను స్వీకరించరు. నామినేషన్‌ వేసే సందర్భంలో ఎస్‌సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5 వేలు, ఇతరులు రూ.10 వేలు డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని 10 మంది ప్రతిపాదించాల్సి ఉంటుంది. వీరంతా నియోజకవర్గ పరిధిలో ఓటరు అయి ఉండాలి. ప్రతి అభ్యర్థి నాలుగు సెట్లు దాఖలు చేయవచ్చు.
 
రిటర్నింగ్‌ అధికారి వద్ద దాఖలు చేయాలి
పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అయిన కలెక్టర్‌ వద్ద అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. నామినేషన్‌ వేసే సందర్భంలో అభ్యర్థితో పాటు నలుగురిని లోనికి అనుమతిస్తారు. వెంట వచ్చిన వారు నిర్దేశించిన ప్రదేశంలో ఉండిపోవాలి. ప్రక్రియ మొత్తం వీడియోలో చిత్రీకరిస్తారు.
ఎన్నిక ప్రచార ఖర్చుపై ఆంక్షలు లేవు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రచార ఖర్చుకు సంబంధించిన ఆంక్షలు లేవు. అయితే ఓటర్లు డబ్బులు పంపిణీ చేయడం, నేరపూరితమైన ఘటనలకు పాల్పడితే చర్యలు తీసుకుంటారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియా, సామాజిక మాధ్యమాలు, కేబుల్‌ టీవీలో ఇచ్చే ప్రకటనలకు తప్పని సరిగా ఎంసీఎంసీ (మీడియా సర్టిఫికేషన్‌ ఆఫ్‌ మానిటరింగ్‌ కమిటీ) ఆమోదం పొందాల్సి ఉంటుంది.
 
ఎంసీఎంసీ చైర్మన్‌గా జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం వ్యవహరిస్తారు. సభ్యులుగా డీఆర్‌ఓ, జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆకాశవాణి మేనేజర్, ఒక సీనియర్‌ జర్నలిస్టు ఉంటారు. అభ్యర్థులు ఎన్నికల ప్రచార ప్రకటనలను వీరు పరిశీలించి  ఆమోదించిన తర్వాతే ముద్రణకు అర్హత పొందుతాయి. కమిటీ ఆమోదం లేకుండా ప్రచార ప్రకటనలు వస్తే ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటారు.
 
మరిన్ని వార్తలు