రాజ భాష..రాచబాటే..

14 Sep, 2017 13:37 IST|Sakshi
రాజ భాష..రాచబాటే..

హిందీ నేర్చుకుంటే ఉపాధి అవకాశాలు
ఆసక్తి చూపుతున్న యువత
నేడు జాతీయ హిందీ దినోత్సవం


పాలకుర్తి టౌన్‌ : ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాష ‘మాండలీస్‌’.. ఆ తర్వాతి స్థానం హిందీ భాషకు దక్కింది. దేశంలో ఈ భాషది మొదటి స్థానమే. అత్యధిక రాష్ట్రాల్లో మాతృభాషగా ఉన్న భాష కూడా హిందీనే. ఈ ప్రాముఖ్యత నేటికీ ఏమాత్రం తగ్గలేదు. ఒక్కప్పుడు తమిళనాడులో హిందీ భాష బోర్డులు కనిపిస్తే తగులబెట్టే రోజుల్లోనూ మహాత్మగాంధీ హిందీ ప్రచార సభలు నిర్వహించారు. ఇప్పటికీ భాషాభివృద్ధికి కమిటీలు ఏర్పాటు చేసి ప్రచార సభలు నిర్వహిస్తూనే ఉన్నారు. హిందీ జాతీయ భాషతో పాటు అధికార భాషగానూ పేరొందింది.

అవకాశాలు బోలెడు....
హిందీ భాషాభివృద్ధికి అనేక సంస్థలు కృషి చేస్తూనే ఉన్నాయి. సాఫ్ట్‌వేర్‌ రంగాల వైపు విద్యార్థులు పరుగులిడుతున్న తరుణంలోనూ హిందీ పండిత శిక్షణకు అనేక మంది యువకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఉపాధ్యాయులుగా, అనువాదకులుగా బోలెడు అవకాశాలున్నాయి. శిక్షణ సంస్థలు కూడా జిల్లాల్లో విస్తరించాయి. కాగా సెప్టెంబర్‌ 14న జాతీయ హిందీ దినోత్సవంగా 1949లో రాజ్యాంగ కమిటీ ప్రకటించింది. అప్పటి నుంచి పలు కార్యక్రమాలు నిర్వహిస్తు ప్రచారం సాగిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి హిందీ భాష యొక్క ప్రాముఖ్యతను వివరించనున్నారు.

బ్యాంకులు, ఎల్‌ఐసీ కార్యాలయాల్లో హిందీభాషను ప్రొత్సహించడానికి అధికారులు కార్యాలయంలోని బోర్డుపై రోజుకో హిందీ పదాన్ని రాసి అటు సిబ్బందికి, ఇటు వినియోగదారులకు అవగాహన పెంచుతున్నారు. హిందీ కోర్సులను అధ్యయనం చేయడం ద్వారా బోధన రంగంలోనే కాకుండా ఇతర వృత్తిపరమైన రంగాల్లో ఉపాధి అవకాశాలు పొందవచ్చు. తపాలా, భారత్‌ సంచార్‌ నిగమ్, జాతీయ బ్యాంకులు, నాయ్యస్థానాలు, జీవిత బీమా, మీడియా, చట్ట సభల్లో ట్రాన్స్‌లేటర్లు, జర్నలిస్ట్‌ ఉద్యోగాలకు హిందీ భాషా పరిజ్ఞానం ఉపయోగపడుతుంది.

మరిన్ని వార్తలు