నేడు నూతలపాటి సాహితీ పురస్కారాలు

24 Jul, 2016 19:29 IST|Sakshi
నేడు నూతలపాటి సాహితీ పురస్కారాలు

నేడు నూతలపాటి సాహితీ పురస్కారాలు

– కవయిత్రి శిలాలోలిత, గౌరునాయుడులు ఎంపిక
– నేడు ఎస్వీయూ ఆర్ట్స్‌ ఆడిటోరియంలో సత్కారాలు


సాక్షి ప్రతినిధి, తిరుపతి :
తిరుపతి కేంద్రంగా 1975లో గంగాధర సాహితీ లహరి మిత్రబృందం నూతలపాటి సాహితీ కుటుంబాన్ని ప్రారంభించారు. మిత్రుడు నూతలపాటి గంగాధరం అకస్మికంగా పాముకాటుకు గురై కన్నుమూయడంతో ఆయన జ్ఞాపకార్థం మధురాంతకం రాజారాం, మునిసుందరంలు అధ్యక్ష, కార్యదర్శులుగా దీన్ని ప్రారంభించారు. గంగాధరం పేరిట ఏటా ఒక్కో రచయితకు పురస్కారాన్ని అందజేసి సత్కరించాలని నిర్ణయించారు. 1976 నుంచి అవార్డుల ప్రదానం ప్రారంభమైంది. 1996 నుంచి నిర్వహణ బాధ్యతలను ఆచార్య కిరణ్‌ క్రాంతి చౌదరి, ఆచార్య నాగోలు కృష్ణారెడ్డి చేపట్టారు. 1976 నుంచి ఇప్పటి వరకూ క్రమం తప్పకుండా ఏటా అవార్డుల ప్రదానం జరుగుతూనే ఉంది. 1986, 89, 2004,2005 సంవత్సరాల్లో మాత్రం అవార్డులు ఇవ్వదగిన కవితలు, రచనలు జ్యూరీకి అందకపోవడంతో ఆ నాలుగేళ్లూ పురస్కారాలను ప్రదానం చేయలేదు. కాగా 2013 ఏడాదికి గాజునది కవితను రచించిన శిలాలోలిత (హైదరాబాద్‌)ను, 2014 ఏడాదికి గాను ‘ఎగిరిపోతున్న పిట్టల కోసం’ కవితను రచించిన గంటేడ గౌరునాయుడు(పార్వతీపురం)లను ఎంపిక చేశారు. సోమవారం జరిగే సత్కార కార్యక్రమంలో ఎస్వీయూ తెలుగు అధ్యయన శాఖ ప్రొఫెసర్‌ ఆచార్య మేడిపల్లి రవికుమార్, నూతలపాటి దుర్గాప్రసాద్, కిరణ్‌ క్రాంతి చౌదరిలతో పాటు పేరున్న సాహితీ ప్రియులు పాల్గొంటారు.

కవయిత్రి శిలాలోలిత గురించి..
1958 జులై 12న శంషాబాద్‌లో జన్మించిన కవయిత్రి శిలాలోలిత అసలు పేరు లక్ష్మి. ప్రముఖ రచయిత యాకోబ్‌ సతీమణి. తెలుగు సాహిత్యంలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తి చేసి తెలుగు అధ్యాపకత్వంలో స్థిరపడ్డారు. పంజరాన్నీ నేనే.. పక్షినీ నేనే, ఎంతెంత దూరం, గాజునది కవితా సంపుటాలు ఎంతో పేరు తెచ్చాయి. విజేత, భూమిక, మానవి, విశాలాక్షి వంటి తెలుగు సాహిత్య పత్రికల్లో కాలమిస్టుగా పనిచేస్తున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కీర్తి పురస్కారం, రమ్యభారతి, హృదయభారతి పురస్కారాలను అందుకున్నారు.
గంటేడ గౌరునాయుడు..
1954 ఆగస్టు 7న విజయనగరం జిల్లా కొమరాడ మండలం దళాయిపేట గ్రామంలో జన్మించిన గౌరునాయుడు ఎంఏ బీఈడీ చదివి ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఉద్యోగ విరమణ చేశాక 1984లో శారతపెళ్లి కథాంజలితో రచనా రంగంలోకి ప్రవేశించారు. ఏటిపాట, ఒకరాత్రి, రెండు స్వప్నాలు, నది నిదానం చేశాక, నాగేటి చాలుకు నమస్కారం.. వంటి రచనలు, కవితలు పేరు తెచ్చాయి. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ధర్మనిధి, ఉత్తమ కథా పురస్కారాలతో పాటు గురజాడ సాహితీ పురస్కారాలను అందుకున్నారు.

 

మరిన్ని వార్తలు