కధనరంగమే

12 Dec, 2016 14:50 IST|Sakshi
కధనరంగమే
పండుటాకుల పడిగాపులు
పింఛన్ల కోసం బ్యాంకుల వద్ద క్యూలు
తోపులాటలతో పలువురికి గాయాలు
పింఛన్‌ లబ్ధిదారులకు రెండు ఖాతాలు 
నగదు ఎందులో పడిందో తెలియక అవస్థలు 
మిగిలినవారి పరిస్థితీ ఇదే తీరు
 
వణికించే చలిలో పండుటాకులు పింఛన్ డబ్బుల కోసం ఇల్లు వదిలి బ్యాంకుల ముందు బారులుదీరుతున్నారు. కొండంత కష్టాన్ని సైతం లెక్కచేయకుండా గంటలతరబడి నిలబడలేక కూలబడుతున్నారు. ఐదొందలైనా చేతికి చిక్కితే మందులకు ఉపయోగించుకోవాలన్న తపన సాయంత్రమైనా అక్కడినుంచి కదలనీయడం లేదు. పడిలేచైనా పది రూపాయల డబ్బులైనా తీసుకువెళ్లలేకపోతానా అనే ఆశ అడియాశలుగానే మిగిలిపోతోంది.  
 
సాక్షి, రాజమహేంద్రవరం:  తమ ఖాతాల్లో పడిన పింఛన్ నగదు తీసుకునే సరికి పండుటాకులు నరకం చూస్తున్నారు. పింఛన్ కోసం ఖాతా పుస్తకాల దుమ్ము దులిపి, బ్యాంకులవైపు అడుగులు వేస్తున్నారు. డెబిట్, రూపే కార్డులు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాంకులకు  వెళ్లాల్సి వస్తోంది. నగదు కొరత కారణంగా అక్కడ భారీ క్యూలు ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే బారులుదీరుతున్నారు. పది గంటలకు బ్యాంకు తెరవగానే ఒక్కసారిగా తోపులాటలు జరుగుతున్నాయి. సోమవారం కాకినాడలోని జగన్నాథపురం ఎస్బీఐ బ్యాంకు వద్ద తోపులాట చోటుచేసుకుంది. ఉదయం నుంచి వేచిఉన్న వృద్ధులు బ్యాంకు గేటు తెరవడంతో ఒక్కసారిగా లోపలికి వెళ్లే ప్రయత్నంలో ఈ తోపులాట చోటుచేసుంది. పలువురు వృద్ధులు కిందపడడంతో గాయాలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ధవళేశ్వరం ఎస్‌.బి.ఐ వద్ద కిలోమీటర్‌ మేర క్యూలో నిలుచున్నారు. కాతేరు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ప్రాంగణం వృద్ధులతో కిటకిటలాడింది. గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకులన్నీ పింఛన్దారులతో కిక్కిరిసి ఉన్నాయి. బ్యాంకు సిబ్బంది ద్వారాల వద్ద నిలుచొని విడతలవారీగా వృద్ధులను బ్యాంకులోని పంపిస్తున్నారు. పలు బ్యాంకుల వద్ద షామియానాలు లేకపోవడంతో ఎండకు పండుటాకులు సొమ్మసిల్లిపడిపోయారు. 
చెలామణిలో లేకపోవడంతో సమస్య
జిల్లాలో 47.5 లక్షల మంది పింఛన్దారులున్నారు. వీరికి ప్రతి నెల రూ.52 కోట్లు పంపిణీ చేస్తున్నారు. పెద్దనోట్ల రద్దు వల్ల ప్రతి నెలా చేతికి ఇచ్చే పింఛన్ నగదు ఈ నెల నుంచి లబ్ధిదారులు బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నారు. వృద్ధులకు బ్యాంకు ఖాతాలున్నా లావాదేవీలు జరపకపోవడంతో అవి చెలామణిలో లేవు. ఇక్కడే అసలు సమస్య తలెత్తుతోంది. ఇప్పటికిప్పుడు ఖాతాను చెలామణిలో పెట్టుకుని, నగదు తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇందుకోసం గుర్తింపు కార్డుల నకళ్లు కోసం జిరాక్స్‌ సెంటర్‌కు, కొత్త పాస్‌ ఫొటో కోసం  స్టూడియోలకు వెళుతున్నారు. బ్యాంకు అధికారులు తమవంతు సహాయంగా లబ్థిదారుల వద్ద ఖాతా చెలామణి అవసరమయ్యే పత్రాలు తీసుకుని వెంటనే నగదు ఇస్తున్నారు. ఇలా ఈ నెల ప్రారంభం నుంచి చేస్తున్నారు. పింఛన్ లబ్థిదారుల్లో దాదాపు 40 వేల మందికి ఖాతాలు లేవు. వీరందిరికీ ఖాతాలు ప్రారంభించాల్సి ఉంది. ప్రస్తుతం బ్యాంకులున్న పరిస్థితిలో ఇప్పటికిప్పుడు ఖాతాలు ప్రారంభించలేని పరిస్థితి. పలు బ్యాంకులు ఖాతా తెరవడానికి వస్తున్న వారి నుంచి పత్రాలు తీసుకుని 15 రోజుల తరువాత రావాల్సిందిగా సూచిస్తున్నారు. 
ఎప్పటికి అందేనో..?
జిల్లాలో పలు బ్యాంకులకు చెందిన 756 బ్రాంచీలున్నాయి. వీటిలో అర్బన్ పరిధిలో 206, సెమీ అర్బన్లో 249, గ్రామీణ ప్రాంతాల్లో 302 బ్రాంచీలున్నాయి. జిల్లాలో 2011 లెక్కల ప్రకారం 1069 గ్రామ పంచాయతీలున్నాయి. అంటే ప్రతి మూడు గ్రామ పంచాయతీలకు ఒక బ్యాంకు ఉంది. జిల్లాలో ఉన్న 4.75 లక్షల పింఛన్దారుల్లో అధిక భాగం లబ్థిదారులు గ్రామాల్లోనే ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బ్యాంకులు చాలా చిన్నవిగా ఉంటాయి. అందులో సిబ్బంది కూడా తక్కువగా ఉంటారు. కొన్ని బ్యాంకుల్లో విత్‌డ్రాలు, జమలకు ఒకే కౌంటర్‌ ఉంటుంది. ఇతర లావాదేవీలు నిలిపివేసి బ్యాంకు పనివేళల్లో వృద్ధుల ఖాతాలు పరిశీలించి రోజుకు 100 మందికి పింఛన్లు ఇచ్చినా 302 బ్రాంచీలు 30,200 మందికి ఇవ్వగలవు. ఈ లెక్కన గ్రామీణ ప్రాంతాల్లోని పింఛన్ నగదు అందాలంటే దాదాపు 10 రోజుల సమయం పడుతుంది.
తీవ్ర పని ఒత్తిడిలో బ్యాంకు సిబ్బంది... 
పెద్దనోట్ల రద్దు తర్వాత గత నెల 9వ తేదీ నుంచి బ్యాంకులు కిటకిటలాడాయి. పెద్దనోట్ల జమ, నగదు మార్పిడితో నెల మొత్తం గడిచిపోయింది.ఇప్పటికీ నగదు కొరత కారణంగా విత్‌డ్రా కోసం ప్రజలు బ్యాంకులకు పరుగెడుతున్నారు. దీంతోపాటు పింఛన్లు కూడా బ్యాంకుల నుంచి పంపిణీ చేస్తుండడంతో సిబ్బంది త్రీవమైన పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. 
 
>
మరిన్ని వార్తలు