సేవాస్ఫూర్తి .. చైతన్యదీప్తి

23 Sep, 2016 19:17 IST|Sakshi
సేవాస్ఫూర్తి .. చైతన్యదీప్తి
  • జిల్లాలో విస్తరిస్తున్న జాతీయ సేవా పథకం
  • 85 కళాశాలల్లో 165 యూనిట్లు, 16,500 మంది వలంటీర్లు
  • నేడు ఎన్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపక దినోత్సవం
  • రాయవరం:
    విద్యార్థి దశ నుంచే సేవా భావం, క్రమశిక్షణ, సమాజంపై అవగాహన కల్పించేందుకు జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌)ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తమ కళాశాలలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలోను, ప్రజలను సమాజ సేవ పట్ల చైతన్యపర్చడంలోను ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్ల కృషి వెల కట్టలేనిది. సమాజంలో ఉన్నవారిని చైతన్యపర్చడంతో పాటు, సమాజ సేవను తమ సేవగా భావించే భావజాలం విద్యార్థి దశ నుంచే అలవాటు చేయడం ద్వారా దేశ భవిష్యత్తుకు పునాదులు వేసినట్లవుతుంది. ప్రతిఫలం ఆశించకుండా సేవా మార్గం పట్టేవారే ఎన్‌ఎస్‌ఎస్‌లో వలంటీర్లుగా చేరతారు. సమాజాభ్యుదయమే ధ్యేయంగా సేవలందిస్తున్న జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్‌)ను 1969 సెప్టెంబరు 24న ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న ఎన్‌ఎస్‌ఎస్‌సౌ ‘సాక్షి’ కథనం. 
     
    ఇంతింతై వటుడింతై అన్నట్టు..
    జాతీయ సేవా పథకాన్ని 1969 సెప్టెంబరు 24న ఏర్పాటు చేశారు. జిల్లాలో ఈ పథకం రోజు రోజుకూ విస్తరిస్తోంది. ప్రారంభంలో జిల్లాలో 10 నుంచి 15 యూనిట్లు ఉండగా ప్రస్తుతం 25 జూనియర్‌ కళాశాలల్లో, 60 డిగ్రీ కళాశాలల్లో 165 యూనిట్లు ఉన్నాయి. మొత్తం 16,500 మంది విద్యార్థులు ఎన్‌ఎస్‌ఎస్‌లో వలంటీర్లుగా కొనసాగుతున్నారు.  
     
    సేవా కార్యక్రమాలు ఇలా..
    ఈ ఏడాది జాతీయ సేవా పథకం కార్యక్రమాలకు సుమారుగా రూ.1.30 కోట్ల బడ్జెట్‌ను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక శిబిరాల నిర్వహణకు రూ.22,500 చొప్పున కేటాయిస్తారు. 2015–16 సంవత్సరంలో 165 ప్రత్యేక సేవా శిబిరాలను నిర్వహించారు. దసరా, క్రిస్మస్, సంక్రాంతి సెలవుల్లో ప్రత్యేక శిబిరాల నిర్వహణకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 
     
    ప్రత్యేక శిబిరాలతో సామాజిక చైతన్యం..
    కళాశాలలకు చెందిన ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్లు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుంటాయి. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబాటు ఉన్న గ్రామాలను ఎంపిక చేస్తాయి. ఆయా గ్రామాల్లో వారం రోజులు పాటు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు. విద్యార్థులు(వలంటీర్లు) రోజూ ఏదో ఒక రూపంలో ప్రజలకు సేవలందిస్తారు. ఇంటింటికీ వెళ్లి పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తారు. మూఢ నమ్మకాలపై చైతన్యవంతం చేస్తారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యాన్ని వివరిస్తారు. తాగునీటి వనరులను ఆయా శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి క్లోరినేషన్‌ చేస్తారు. వైద్య, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తారు. ప్రభుత్వ పథకాలు పొందడంపై అవగాహన కల్పిస్తారు. ఓటరుగా పేరు నమోదు చేసుకోవడం, ఓటు విలువ తెలియజేయడం, ఉన్నత లక్ష్యాలు, సమాజానికి మేలు చేసే వ్యక్తిని ప్రజాప్రతినిధిగా ఎంపిక చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేస్తారు. చదువు విలువను తెలియజేసి, అక్షరాస్యతను పెంపొందిస్తారు. 
     
    యూనిట్ల బలోపేతమే లక్ష్యం..
    జిల్లాలో ప్రస్తుతం ఉన్న 165 యూనిట్లను బలోపేతం చేయడమే లక్ష్యం. ప్రతి యూనిట్‌లో 100 మంది విద్యార్థులను చేర్చుకుంటున్నాం. ప్రత్యేక క్యాంపునకు 50 మందిని తీసుకువెళ్తాం. ఎన్‌ఎస్‌ఎస్‌లో చేరిన విద్యార్థుల్లో వ్యక్తిగత క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం పెంపొందుతాయి. ప్రస్తుత యువత రక్తదానానికి ప్రాధాన్యమిస్తున్నారు. ప్రజలకు సామాజిక విలువను తెలియజేస్తున్నారు. ప్రజా చైతన్యంతో పల్లెలు ప్రగతిబాట పడతాయి. 
    – డాక్టర్‌ పి.వి.కృష్ణారావు, ఎస్‌ఎస్‌ఎస్‌ జిల్లా ప్రోగ్రామ్‌ అధికారి 
     
     
మరిన్ని వార్తలు