నేటి నుంచి సత్యదేవుని ఆవిర్భావ వేడుకలు

23 Jul, 2017 23:24 IST|Sakshi
నేటి నుంచి సత్యదేవుని ఆవిర్భావ వేడుకలు
అన్నవరం (ప్రత్తిపాడు) : సత్యదేవుని 127వ ఆవిర్భావ దినోత్సవాలకు రత్నగిరి ముస్తాబైంది. సోమవారం నుంచి బుధవారం వరకూ మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని దేవస్థానం నిర్ణయించింది. ఉత్సవాలకు సోమవారం అంకురార్పణ చేస్తారు. ఈ సందర్భంగా రుత్విక్కులకు దీక్షావస్త్రాలు బహూకరిస్తారు. స్వామివారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు స్వామి, అమ్మవారు, శంకరుల మూలవిరాట్‌లకు పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. అదే రోజు ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి ఆయుష్య హోమానికి అంకురార్పణ చేస్తారు. ఈ ఏడాది కొత్తగా పవిత్రోత్సవాలను కూడా ప్రారంభించనున్నారు. స్వామివారికి వివిధ కూరగాయలు, సుగంధద్రవ్యాలతో వండిన పిండివంట ‘కాయం’ నివేదిస్తారు. స్వామివారి జన్మనక్షత్రం మఖ సందర్భంగా బుధవారం తెల్లవారుజామున కూడా స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. రెండో రోజు కూడా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. అనంతరం చేతికి కట్టుకునే కంకణాలను భక్తులకు బహూకరిస్తారు. ఉత్సవాల సందర్భంగా దేవస్థానంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
శ్రీరామునికి ఘనంగా జన్మనక్షత్ర పూజలు
రత్నగిరి క్షేత్రపాలకుడు శ్రీరామచంద్రమూర్తి జన్మనక్షత్రం పునర్వసు సందర్భంగా రామాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవం కూడా ఘనంగా నిర్వహించారు.
కల్యాణ వేదికపై సూర్యనమస్కారాలు
ప్రతి ఆదివారం రత్నగిరిపై సత్యదేవుని కల్యాణ వేదిక మీద నిర్వహిస్తున్న సూర్య నమస్కారాలు ఈ వారం కూడా కొనసాగాయి. ఆకొండి కృష్ణ, రేపాక రామదాసు, తదితరులు ఈ కార్యక్రమం నిర్వహించారు.
మరిన్ని వార్తలు