ప్రమాదంలో ఓ‘జోన్‌’

15 Sep, 2016 23:12 IST|Sakshi
ప్రమాదంలో ఓ‘జోన్‌’

→   దెబ్బతిన్న పర్యావరణ సమతుల్యత
→   జిల్లాలో ఎడారి ఛాయలు
→   నేడు ఓజోన్‌ పొర పరిరక్షణ దినోత్సవం

విపరీతమైన ఎండలు... అప్పుడప్పుడు నేనున్నాంటూ పలకరించపోయే వర్షాలు అనంతపురం జిల్లా వాసులకు కొత్తమీ కాదు. అయితే ఈ వైపరీత్యానికి కారణలేమిటి? కొన్నేళ్లుగా సామాన్య ప్రజలను వేధిస్తున్న ఈ ప్రశ్నకు సమాధానం ఓజోన్‌ పొర దెబ్బతినడమే నన్నది అక్షర సత్యం. దీనిపై సరైన అవగాహన లేకపోవడంతో జిల్లాలో ఎడారి ఛాయలు శరవేగంగా విస్తరిస్తున్నాయి.

కొంచెం ఎండ ఎక్కువైతేనే బయటకెళ్లడానికి భయపడ్తాం. అలాంటిది భగభగ మండే సూర్యకిరణాలు నేరుగా మనపై పడితే తట్టుకోగలమా?! అస్సలు తట్టుకోలేం. కానీ ఈ విధమైన ప్రమాదం భవిష్యత్తులో పొంచి ఉందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే సూర్యుడి నుంచి వెలువడే అతి నీల లోహిత కిరణాల ప్రభావం నేరుగా మన మీద పడకుండా రక్షించే ఓజోన్‌ పొర క్రమంగా పలుచబడడమే ఇందుకు కారణం.

మానవ చర్యలే ఇందుకు కారణమని 1987 నాటి ‘మాంబ్రెయిల్‌ ప్రొటోకాల్‌’ (ఓజోన్‌ పొర క్షీణతపై జరిగిన పరిశోధన) హెచ్చరించింది. అయితే ఓజోన్‌ పొర పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏం చేయాలనే దానిపై 1994, సెప్టెంబర్‌ 16న సమావేశం జరిగింది. అదే యు.ఎన్‌.జనరల్‌ అసెంబ్లీ సమావేశం. ఓజోన్‌ క్షీణతపై ఈ సమావేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఓజోన్‌ పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకునే దిశగా అడుగేయాలని, ఇందు కోసం ప్రతి ఏటా సెప్టెంబర్‌ 16న అంతర్జాతీయ ఓజోన్‌ పరిరక్షణ దినోత్సవం జరపాలని సమావేశం తీర్మానించింది.

పాఠశాల స్థాయిలోనే అవగాహన కల్పించాలి
ఓజోన్‌ పొర ప్రాముఖ్యత గురించి పాఠశాల స్థాయిలోనే అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కన్నా స్వచ్చంద సంస్థలే ముందున్నాయి. జిల్లాలో జనవిజ్ఙాన వేదిక, ఆర్డీటి, యాక్షన్‌ ఫెటర్నా, టింబక్ట్, రిడ్స్‌ వంటి స్వచ్చంద సంస్థలు, రచయితలు... ఓజోన్‌ సమస్య గురించి  జిల్లా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

పర్యావరణంపై అవగాహన ఉండాలి  
ఓజోన్‌పొరను రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత, ముఖ్యంగా విద్యార్థులలో ఈ విషయంపై చక్కటి అవగాహన కల్పించాలి. భూమిపై రక్షణకవచంగా ఆవిరించుకున్న ఓజోన్‌పొర  నానాటికి పలుచబడుతూ ప్రమాద  స్థాయిని సూచిస్తోంది. కొన్ని దశాబ్ధాల కిందట కేవలం ఇబ్బందులను మాత్రమే కలుగజేసిన వాతావరణం, నేడు ఓజోన్‌ పొర క్షీణించడం వలన అతి ప్రమాదకర స్థాయికి చేరుకుంది.
– వైవీ మల్లారెడ్డి, యాక్షన్‌ ఫెటర్నా ఎకాలజీ సెంటర్‌

చెట్లను నరకడం నేరంగా భావించాలి
ప్రకతిని యథేచ్చగా నాశనం చేస్తూ బాధ్యతారాహిత్యంగా ఉంటే రాబోయే వినాశనం మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది. రోజు రోజుకూ కాలుష్యం బారిన పడుతున్న పర్యావరణాన్ని పరిరక్షించుకోక పోతే పెనుముప్పు తప్పదు.  చెట్లను కొత్తగా నాటడం దేవుడెరుగు, పెద్దగా పెరిగి నీడను, ప్రాణవాయువును అందిస్తున్న చెట్లను నరకడాన్ని నేరంగా పరిగణించాలి.
– జెన్నే ఆనంద్, రచయిత

మరిన్ని వార్తలు