నేడు పోలీసు కానిస్టేబుల్‌ మెయిన్స్‌ పరీక్ష

22 Jan, 2017 00:34 IST|Sakshi
– ఉదయం పది నుంచి ఒంటి గంట వరకు నిర్వహణ
– 27 కేంద్రాల్లో పరీక్ష రాయనున్న 16,796 మంది అభ్యర్థులు
– మాల్‌ ప్రాక్టీస్‌ నివారణ కోసం బయోమెట్రిక్‌ స్కానింగ్‌ విధానం
– భర్తీకానున్న 622 పోస్టులు
– ఏర్పాట్లను పూర్తి చేసిన పోలీసు శాఖ
 
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పోలీసు కానిస్టేబుల్‌ మెయిన్స్‌ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల అభ్యర్థులకు కర్నూలులో 27 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం మూడు జిల్లాలకు సంబంధించి మెయిన్స్‌కు మొత్తం 16,796 మంది పరీక్షకు అర్హత సాధించారు. సివిల్, ఏఆర్‌ కానిస్టేబుల్స్, జైల్‌ వార్డెన్ల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మొదట స్క్రీనింగ్‌ టెస్టును నిర్వహించింది. డిసెంబర్‌ 8 నుంచి 20వ తేదీ వరకు దేహదారుఢ్య పరీక్షలను నిర్వహించారు. అందులో అర్హత సాధించిన వారిని మెయిన్స్‌కు ఎంపిక చేశారు. మెయిన్స్‌ పరీక్షను ఆదివారం ఉదయం పది నుంచి ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు. పరీక్షలో మాల్‌ ప్రాక్టీస్‌ను అరికట్టేందుకు పోలీసుశాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంది. అందులో భాగంగా బయోమెట్రిక్‌ స్కానింగ్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు 27 కేంద్రాల్లో 94 మంది బయోమెట్రిక్‌ ఇన్విజిలేటర్లను నియమించారు. వారికి వ్యాస్‌ ఆడిటోరియంలో ఇటీవల శిక్షణ కూడా ఇచ్చారు. ఈ విధానంలో అభ్యర్థుల నుంచి వేలిముద్రలు స్వీకరిస్తారు. అలాగే పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఉండే జిరాక్స్, నెట్‌ సెంటర్లను మూసి వేయించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. 
 
మూడు జిల్లాల్లో భర్తీకానున్న 622 పోస్టులు 
కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలో పోలీసు కానిస్టేబుల్‌ మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలులోనే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 16,796 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. ఇందులో కర్నూలు జిల్లాకు చెందిన అభ్యర్థులు7.969, కడప -5,196, అనంతపురం అభ్యర్థులు 3,631మంది ఉన్నారు. కర్నూలులో 221 పోస్టులు, కడపలో 123, అనంతపురంలో 278 పోస్టులు భర్తీకానున్నాయి. మూడు జిల్లాలో కలిపి మొత్తం 622 పోస్టులు ఉన్నాయి. 
నిమిషం ఆలస్యమైనా అనుమతించం:  ఆకె రవికృష్ణ, కర్నూలు జిల్లా ఎస్‌పీ
పోలీస్‌ కానిస్టేబుల్‌ మెయిన్స్‌ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశాం. గంట ముందు నుంచే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తాం. నిమిషం ఆలస్యమైన అనుమతించం. అభ్యర్థులు హాల్‌ టిక్కెట్, ఆధార్‌ కార్డు లేదంటే ఇతర గుర్తింపు కార్డును కచ్చితంగా తీసుకురావాలి. పరీక్షలో సమాధానాలను బ్లాక్‌ లేదా బ్లూ పెన్నుతో మాత్రమే రాయాల్సి ఉంది. క్యాలిక్యులేటర్లు, వాచ్‌లను పరీక్ష కేంద్రంలోకి అనుమతించం. పరీక్షల నిర్వహణకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాం.  
 
మరిన్ని వార్తలు