రెండు చుక్కలు.. మర్చిపోవద్దు!

28 Jan, 2017 23:32 IST|Sakshi
రెండు చుక్కలు.. మర్చిపోవద్దు!

– నేడు జిల్లా వ్యాప్తంగా ‘పల్స్‌ పోలియో’
– 30, 31 తేదీల్లో ఇంటింటి సందర్శన


జిల్లా జనాభా : 42,99,541
లక్ష్యం (0–5 ఏళ్లలోపు పిల్లలు) : 4,50,545 మంది
గ్రామీణ ప్రాంతాల్లోని పల్స్‌ పోలియో బూత్‌లు : 3195
పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బూత్‌లు : 422
పల్స్‌ పోలియోలో పాల్గొనే సిబ్బంది : 14,684
రూట్‌ సూపర్‌వైజర్లు : 376
మొబైల్‌ బృందాలు : 96
హై రిస్క్‌ ప్రాంతాలు : 267
సరఫరా చేసిన వ్యాక్సిన్లు : 5,90,000
బూత్‌లలో చుక్కలు వేసే తేదీ : జనవరి 29
ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేసే కార్యక్రమం : జనవరి 30, జనవరి 31


అనంతపురం మెడికల్‌ : నేటి బాలలే రేపటి పౌరులు. ఆ పిల్లలు భవిష్యత్‌లో ఆరోగ్యంగా ఉండేందుకు వారికి పలు రకాల వ్యాక్సిన్లు తప్పనిసరిగా వేయించాలి. ఆదివారం జిల్లా వ్యాప్తంగా ‘పల్స్‌ పోలియో’ నిర్వహించనున్నారు. ‘నిండు జీవితానికి రెండు చుక్కలు’ నినాదంతో వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. పిల్లలు అంగ వైకల్యం, అనారోగ్యం లేకుండా పెరిగేందుకు, పుట్టిన నాటి నుంచి ఆరోగ్య శాఖ నిర్ణయించిన సమయంలో వ్యాక్సిన్లు ఇప్పిస్తూ ఉండాలంటున్నారు వైద్యులు. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రకాల వ్యాక్సిన్లను ఉచితంగా అందజేస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌ సెంటర్లలో నిర్దేశించిన వ్యాక్సిన్లు ఉచితంగా వేస్తున్నారు. పిల్లలు పుట్టగానే ఆయా ఆస్పత్రులలో పిల్లలకు ఇవ్వాల్సిన వ్యాక్సిన్ల వివరాలతో కూడిన చార్టును తల్లిదండ్రులకు అందజేస్తారు. చార్టు ఆధారంగా వాక్సిన్లు ఇప్పిస్తే పిల్లలను పలు రకాల వ్యాధుల బారినుంచి కాపాడిన వారవుతారు.

పోలియో వ్యాక్సిన్‌తోనే ‘జీవితం’ ప్రారంభం :
పిల్లలు పుట్టగానే వారికి పోలియో వ్యాధి నివారణ వ్యాక్సిన్‌ ఇవ్వడంతో పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
– పిల్లలు పుట్టిన వెంటనే ఓరల్‌ పోలియో వ్యాక్సిన్‌ను (ఓపీవీ) జీరో డోస్‌ ఇస్తారు. ఈ వ్యాక్సిన్‌ను పిల్లలకు అంగ వైకల్యం రాకుండా ఉండేందుకు వేస్తారు.
– 24 గంటలలోపు హెపటైటిస్‌ బీ జీరో డోస్‌ వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్‌ ఇవ్వడం వల్ల పిల్లలకు పచ్చ కామెర్ల వ్యాధి రాదు. బీసీజీ వ్యాక్సిన్‌ సైతం వేయించాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్‌ క్షయ వ్యాధి నివారణకు పని చేస్తుంది.
– ఆరు వారాలకు, పది వారాలకు, 14 వారాలకు పలు రకాల వ్యాక్సిన్లు ఇప్పించాల్సి ఉంటుంది. ఆరు, పది, 14 వారాలు నిండిన పిల్లలకు ఓపీవీ, డీపీటీ, హెపటైటిస్‌ వ్యాక్సిన్లను వేస్తారు. ఈ వ్యాక్సిన్లు పుట్టిన వెంటనే ఇచ్చినప్పటికీ ఆయా వారాల్లో సైతం ఇవ్వాలి. అదనంగా ఇచ్చే డీపీటీ వ్యాక్సిన్‌ కంటి వాపు, గోరింత దగ్గు, ధనుర్వాతం వ్యాధుల నివారణకు  పని చేస్తుంది.
– తొమ్మిది నెలలు నిండిన తర్వాత 12 నెలల్లోపు మీజిల్స్‌ వ్యాక్సిన్, విటమిన్‌ ఏ ద్రావణం ఇప్పించాలి. మీజిల్స్‌ వ్యాక్సిన్‌ తట్టువ్యాధి నివారణకు పని చేస్తుంది. విటమిన్‌–ఎ ద్రావణం ఇవ్వడంతో అంధత్వ నివారణ, రే చీకటిని నివారించవచ్చు.
– పదో నెలలో జేఈ వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ ఇప్పించాలి. ఇది మెదడు వాపు నివారణకు పని చేస్తుంది.
– 16 నెలలు నిండినప్పటి నుంచి 24 నెలల మధ్య డీపీటీ, ఓపీవీ వ్యాక్సిన్లను బూస్టర్‌ డోస్‌లు ఇప్పించాల్సి ఉంటుంది. వీటితో పాటు మీజిల్స్‌ రెండో డోస్‌ను సైతం ఇప్పించాలి.  
– ఐదేళ్ల నుంచి ఆరేళ్ల మ«ధ్య వయసులో డీపీటీ 5 ఇయర్స్‌ డోస్‌ను ఇప్పించాలి.
– పిల్లలకు పదేళ్లు నిండిన తర్వాత టీటీ మొదటి డోస్‌ను, 16వ సంవత్సరంలో టీటీ మరో డోస్‌ను ఇప్పించాల్సి ఉంటుంది.

తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయద్దు
పల్స్‌పోలియో కోసం పకడ్బందీ చర్యలు తీసుకున్నాం. వ్యాక్సిన్‌ను అన్ని ఆస్పత్రులకు పంపిణీ చేశాం. 0–5 ఏళ్లలోపు చిన్నారులందరికీ చుక్కలు వేయించండి. ఈ విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయద్దు.
- డాక్టర్‌ పురుషోత్తం, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి

ఉదయం 7 నుంచి ప్రారంభం
పల్స్‌పోలియోను ఉదయం 7 గంటలకు ప్రారంభిస్తాం. సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది. 200 నుంచి 250 చిన్నారులున్న ప్రాంతాల్లో పోలియో బూత్‌లను ఏర్పాటు చేశాం. ప్రత్యేకంగా మొబైల్‌ బృందాలు పని చేస్తాయి. అంతా కలిసికట్టుగా పని చేసి చుక్కలు వేయించాలి. 30, 31వ తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వచ్చి చుక్కలు వేస్తారు.
- డాక్టర్‌ వెంకటరమణ, డీఎంహెచ్‌ఓ

మరిన్ని వార్తలు