నేడు రెవెన్యూ ఉద్యోగుల క్రికెట్‌ టోర్నీ

28 Jan, 2017 22:50 IST|Sakshi

అనంతపురం అర్బన్‌ : రెవెన్యూ శాఖ ఉద్యోగులకు ఆదివారం నుంచి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా మొదట క్రికెట్‌ టోర్నీని కలెక్టర్‌ కోన శశిధర్‌ ప్రారంభిస్తారని రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయరామప్ప, రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఆ వివరాలను శనివారం వారు కలెక్టరేట్‌లో విలేకరులకు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులు పని ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం పొందేందుకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు అవసరమన్నారు. అందులో భాగంగానే రెండు సంఘాలు సంయుక్తంగా ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అయితే సమయాభావం వల్ల నిర్ణయించిన తేదీ కన్నా ముందే క్రికెట్‌ పోటీలు మొదలుపెడుతున్నట్లు తెలిపారు. స్థానిక ఆర్డీటీ స్టేడియంలో ఆదివాకరం ఉదయం 8 గంటలకు క్రికెట్‌ టోర్నీని కలెక్టర్‌ ప్రారంభిస్తారన్నారు.

క్రికెట్‌ మ్యాచ్‌లు ఇలా...
ఆర్డీటీ స్టేడియంలో ఆదివారం ఉదయం 8 గంటలకు పెనుకొండ, అనంతపురం రెవెన్యూ జట్ల మధ్య, ధర్మవరం, కదిరి రెవెన్యూ జట్ల మధ్య పోటీ ఉంటుంది. విజేతలైన జట్లతో మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్, కళ్యాణదుర్గం రెవెన్యూ జట్లు తలపడతాయి. ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం 9 గంటలకు ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహిస్తారు.

మరిన్ని వార్తలు