నేటినుంచి టీటీడీ నమూనా ఆలయం ప్రారంభం

6 Aug, 2016 23:33 IST|Sakshi
విజయవాడలో నిర్మిస్తున్న శ్రీవారి నమూనా ఆలయం
 
తిరుపతి అర్బన్‌: పవిత్ర కృష్ణా పుష్కరాల సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో విజయవాడలో శ్రీవారి నమూనా ఆలయం ఆదివారం ఉదయం ప్రారంభం కానుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ మేరకు విజయవాడ పీడబ్ల్యూడీ మైదానంలో నమూనా ఆలయం వద్ద ఉదయం 7 నుంచి 9 గంటల వరకు మహా సంప్రోక్షణ శాస్త్రోక్తంగా నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం కృష్ణానది నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో సంప్రోక్షణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనున్నామన్నారు. ఈ నమూనా ఆలయంలో వైఖాసన ఆగమోక్తంగా సేవలన్నీ స్వామి వారికి ఏకాంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇందులో ఉదయం ప్రారంభం అయ్యే తొలి సుప్రభాతం, అనంతరం తోమాల సేవ, కొలువు, అర్చన, నివేదన, శాత్తుమొర, ఊంజల్‌ సేవల, ఏకాంత సేవలను తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో నిర్వహించేందుకు టీటీడీ అర్చకులు అన్ని చర్యలు తీసుకున్నారని వివరించారు. లక్షమంది భక్తులు దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.   భక్తులకు అన్నప్రసాదం, తీర్థప్రసాదాలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. రోజూ సాయంత్రం నమూనా ఆలయం నుంచి  పద్మావతి ఘాట్‌ వెళ్లి పుష్కర హారతి ఇవ్వడం ద్వారా కృష్ణమ్మకు శ్రీవారి ఆశీస్సులు అందిస్తారని తెలిపారు.
 
 
 
మరిన్ని వార్తలు