వినాయక..నమో నమః

24 Aug, 2017 22:34 IST|Sakshi
వినాయక..నమో నమః

– వాడవాడలా సిద్ధమైన మండపాలు
- విద్యుత్‌ దీపాలతో కాంతులీనుతున్న వీధులు
– పూజ సామగ్రి కొనుగోళ్లతో మార్కెట్లు కిటకిట


విఘ్ననాయకుడు చవితికి సిద్ధమయ్యాడు. ఉత్సవాలకు జనం
వినాయక చవితి వచ్చిందంటే చిన్నా, పెద్దా తేడా లేకుండా ఉత్సవంలో పాల్గొనే ఆ సంతోషం మాటల్లో చెప్పలేనిది. పల్లె నుంచి పట్నం దాకా సంబరాలు అంబరాన్నంటుతాయి. అందుకే అందరూ గణేష్ ఉత్సవాలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తుంటారు. అందరినీ ఒక్కటి చేసే ఈ పండుగ రానే వచ్చింది.
ఇలా పండుగ రానే వచ్చింది.నేడు వినాయక చవితి. కూలీలు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు,,చిన్నాపెద్దా తేడా లేకుండా ‘అనంత’ వాసులంతా ‘జైబోలో గణేశ్‌ మహారాజ్‌కి...జై’ అంటూ విగ్రహాలను తమ ప్రాంతాలకు తీసుకెళ్లారు.

– అనంతపురం కల్చరల్‌:

భాద్రపదమాస బహుళ చవితి నాడు వినాయక చవితి పండుగ వస్తుంది. భక్తులంతా బహురూపాల్లో వినాయకుడి ప్రతిమలు రూపొందించి పూజలు చేస్తారు. పండుగ నేపథ్యంలో గురువారమే జిల్లా వ్యాప్తంగా వినాయకుడి ప్రతిమలను కొనుగోలు చేసి ఇళ్లకు తీసుకెళ్లారు. ఇక పర్యావరణ హితం కోసం చేపట్టిన మట్టి విగ్రహాల పంపిణీకి విశేష స్పందన లభించింది. అనంతపురం, ధర్మవరం, హిందూపురం, గుంతకల్లు, తాడిపత్రి, కదిరితో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణప్రాంతాలు గురువారం ఉదయం నుంచి విగ్రహాల కొనుగోళ్లతో సందడి మారాయి. ఆటోలు, ట్రాక్టర్లు, భారీ లారీలలో విగ్రహాలను తీసుకెళ్లారు. గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు స్కూళ్లు సెలవు ప్రకటించడంతో విద్యార్థులు కూడా పెద్దలతో పాటు విగ్రహాల వద్దకు వచ్చారు. కాషాయరంగు రిబ్బన్లు తలకు ధరించి ‘జైబోలే గణేశ్‌ మహారాజ్‌కి జై...గణపతిబప్ప మోరియా...అంటూ ఈలలు, కేకలు వేసుకుంటూ విగ్రహాలను తరలించారు.

ముస్తాబైన మండపాలు
గణనాథుడు కొలువుదీరే మండపాలను అందంగా ముస్తాబు చేశారు. అనంతపురంలోని వినాయక్‌చౌక్‌లో 13 రోజులుగా మండపం నిర్మాణపనులు సాగాయి. 35 ఏళ్లుగా ఇక్కడ ఖరీదైన మండపాన్ని నిర్మించి అంగరంగ వైభవంగా పండుగను చేస్తున్నారు. అలాగే జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుదీపాలు, లైటింగ్‌బోర్డులు, భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మండపాలను అలంకరించారు.

కిటకిటలాడిన ప్రధాన కూడళ్లు
జిల్లాలోని అన్ని పట్టణప్రాంతాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు మార్కెట్‌తో పాటు ప్రధాన వీధులన్నీ జనంతో పోటెత్తాయి. నూతన వస్త్రాల కొనుగోళ్లతో షాపింగ్‌మాళ్లు కిటకిటలాడాయి. చెరుకు గడలు, పూలు, గరిక, పండ్లు లాంటి  పూజా సామగ్రి, వినాయక ప్రతిమలను ఇంటి తీసుకెళ్లడానికి వచ్చిన జనంతో మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. అనంతపురం నగరంలోని పండుగ మొత్తం పాతూరుమార్కెట్‌ వద్దే కన్పించింది. పూల దుకాణాల వద్ద రద్దీతో జనాలు అడుగుతీసి అడుగేయడమే కష్టంగా మారింది.  

రాష్ట్రంలోనే సం‘చలనం’
వినాయక చవితి వేడుకల్లో భాగంగా జిల్లా వాసులు తొలిసారి విగ్రహాలను కదిలేలా రూపొందించారు. 35 ఏళ్ల కిందట నుంచే వినాయక చవితి పర్వదినానికి సంబంధముండే పురాణేతిహాసాలతో సంగీతంతో మమేకమై సాగే కదలికలు రాష్ట్రంలోనే తొలిసారి నగరంతోనే ప్రారంభమయ్యాయి. అదే నేపథ్యంలో ఈ సంవత్సరం ‘గంగా–పార్వతీ సంవాదం’ పేరిట భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రాజస్థాన్‌ రాష్ట్రంలోని సుప్రసిద్ధ రణతంబోర్‌ వినాయక ఆలయ నమూనాతో పాటు దాదాపు రూ.30 లక్షల వ్యయంతో సాగుతున్న విగ్రహ కదలికలు జిల్లాకే తల మానికం కానున్నాయి.

10 వేల విగ్రహాలు
అనంతపురం నగరంలో అధికారికంగా 510 విగ్రహాలకు అనుమతి తీసుకున్నారు. అనధికారికంగా మరో 500కుపైగా విగ్రహాలను ఏర్పాటు చేసి ఉంటారు. వీటితో పాటు ఇళ్లలో ఏర్పాటు చేసినవి అదనం. ఇలా జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లోని పట్టణ, పల్లె ప్రాంతాల్లో కలిపి కనీసం 10 వేల విగ్రహాలు ఏర్పాటు చేసి ఉంటారని అంచనా. ఈ లెక్కన ఈ పండుగ ఖర్చు కనీసం రూ.50 కోట్ల మేర ఉంటుంది. అనంతపురంలోని మొదటిరోడ్డులోని వినాయక చౌక్, కోర్టురోడ్డు, రాణీనగర్‌లలో సైతం కదలిక వినాయకులు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.  అన్ని చోట్లా శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ప్రత్యేక పూజలు జరుగనున్నాయి.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా