మితాహారం..ఆరోగ్యకరం

15 Oct, 2016 22:50 IST|Sakshi
మితాహారం..ఆరోగ్యకరం

– ఘాటు వంటకాలతో చేటే
– జిల్లాలో పెరుగుతున్న ‘ఫాస్ట్‌ఫుడ్‌’ కల్చర్‌
– ఊబకాయానికి దారి తీస్తుందంటున్న వైద్యులు
– ఆకుకూరలు, కూరగాయలు తినాలని సూచన

సందర్భం : నేడు ప్రపంచ ఆహార దినోత్సవం

ఫాస్ట్‌ ఫుడ్‌.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ కల్చర్‌ ఎక్కువైంది. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ వ్యాపారం ఇప్పుడు పల్లెలకూ పాకింది. ఈ క్రమంలో ఏవి పడితే అవి తింటూ జనం అనారోగ్యం పాలవుతున్నారు. బతకడానికి ఆహారం అవసరమేనని, అయితే అది మితంగా ఉండాలంటున్నారు వైద్యులు. నేడు ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.   


అధికమేతే అనర్థం
సాయంత్రం వేళ వెచ్చగా ఉండాలని ఏదో ఒకటి తినడం ఇప్పుడు అలవాటుగా మారింది. కళాశాలకు వెళ్లొచ్చాక విద్యార్థులు.. ఆఫీసుల నుంచి వచ్చాక ఉద్యోగులు.. వ్యాపారస్తులు.. ఇలా ప్రతి ఒక్కరూ బయటి తిండికే అలవాటు పడుతున్నారు. ఏదో ఒకటి తింటూ పోతే శరీరం బొద్దుగా, అడ్డదిడ్డంగా మారి కొవ్వు పెరిగిపోతుందని డాక్టర్లు అంటున్నారు. పని ఒత్తిడిలో ఉన్నామనో.. ఏదో పొద్దు గడవడం లేదనో కొందరు కాస్త సేదదీరడానికి కాఫీలు, టీలతో పాటు ఐస్‌క్రీంలు, చిరుతిండ్లు తీసుకుంటారు. అప్పటికప్పుడు అవి ఉపశమనం కలిగించినా మన ఆరోగ్యాన్ని మాత్రం దెబ్బతీస్తాయి. ఊబకాయానికి ఫుడ్‌ అడెక్షనే ప్రధాన కారణమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని వైద్యులు చెబుతున్నారు.  కొవ్వు పెరిగితే గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 30 ఏళ్లలోపు వారిలో కూడా గుండెపోటు రావడానికి ఇదే కారణమని వైద్యులు చెబుతున్నారు. షుగర్, బీపీ, ఆకలి మందగించడం, అల్సర్‌కు గురికావడంతో పాటు ఒత్తిడికి లోనవుతుంటారు.  

ఎంత ఆహారం తీసుకోవాలి?
25 ఏళ్లలోపు వయసు గల వారు 2500 కేలరీల శక్తి లభించే ఆహారం తీసుకోవాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా ఆహారంలో సమతుల్యత పాటించాలి. ఆరోగ్యంగా 60 కిలోలున్న వ్యక్తికి 1600 కేలరీల ఆహారం అవసరం. ఇందులో 60 శాతం కార్బోహైడ్రేట్లు, 15 శాతం ప్రొటీన్లు, 25 శాతం కొవ్వు ఉండేలా చూసుకోవాలి.

జిల్లాలో ఫాస్ట్‌ఫుడ్‌ సంస్కతి
ప్రస్తుతం ఫాస్ట్‌ఫుడ్‌ సంస్కతి బాగా పెరిగిపోతోంది. అనంతపురం, గుంతకల్లు, ధర్మవరం, తాడిపత్రి, హిందూపురం, కదిరి, పెనుకొండ, కళ్యాణదుర్గ, గుత్తి, రాయదుర్గం.. ఇలా అన్ని  పట్టణాల్లో వందల సంఖ్యలో సెంటర్లు ఉన్నాయి. దీంతో విద్యార్థుల్లో ఫాస్ట్‌ఫుడ్‌ తినే అలవాటు ఎక్కువైంది. మధ్యాహ్న భోజన సమయంతో పాటు సాయంత్రం ఇళ్లకు వచ్చాక ప్రైడ్‌రైస్, ఎగ్‌పఫ్, గోబీరైస్, సమోసా ఆరగించి కడుపునింపుకుంటున్నారు. పెద్దలు కూడా పకోడి, మిర్చి, కబాబ్స్, బజ్జీలు, గారెలు తదితర ఘాటు వంటకాలు తింటుంటారు. దీని వల్ల శరీరానికి హాని కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు ఘాటు వంటకాలు తగ్గించుకోవాలని వైద్యులు అంటున్నారు.  

చైనీస్‌ వంటకాల్లో అధిక సోడియం
తినే ఆహారంలో సోడియం అతి తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఏ మాత్రం మోతాదుకు మించినా రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చైనీస్‌ వంటకాలను తగ్గించుకోవాలి. వీటిలో సోయా, టమాటా సాస్‌ను వినియోగిస్తారు. అందులో సోడియం అధికంగా ఉంటుంది. పలురకాల చిప్స్, సాల్టెడ్‌ నట్స్‌లో కూడా ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యంగా జీవించడానికి కొన్ని నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది. బ్రేక్‌ఫాస్ట్‌ ఎక్కువగా తీసుకోరాదు. మధ్యాహ్నం చపాతి, కొద్ది రైస్‌ తీసుకుంటే మేలు. రాత్రి కేవలం చపాతీతోనే సరిపెట్టుకోవాలి. రోజూ నిర్ణీత సమయంలో భోజనం చేయాలి.

ఆకుకూరలు, కూరగాయలే మేలు
అతిగా తినడం, ఏది పడితే అది భుజించడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. బయటి తిండి తిన్నప్పుడు ఒక్కో సారి వాంతులు, విరేచనాలు అవుతాయి. ఫుడ్‌ పాయిజన్‌ అయితే ఇలాంటి ప్రభావం ఉంటుంది. బీపీ, షుగర్‌ వస్తాయి. ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. ఇవి రాకుండా ఉండాలంటే శారీరక శ్రమ అవసరం. వ్యాయామం చేయాలి. కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలి. చిరుతిళ్లకు అలవాటు పడొద్దు. ఆయిల్‌ ఫుడ్‌తో ఎంత మాత్రం ప్రయోజనం లేదు. ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలి.   
– డాక్టర్‌ కేఎస్‌ఎస్‌ వెంకటేశ్వరరావు, ఫిజీషియన్‌ (మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌), అనంతపురం

మరిన్ని వార్తలు