జనమే జనం

11 Jul, 2016 02:56 IST|Sakshi
జనమే జనం

జనాభా పెరుగుదల, జనసాంద్రత ఎక్కువున్న జిల్లాగా రంగారెడ్డికి ప్రత్యేక స్థానముంది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక జనాభా ఉన్నది ఇక్కడే. 2011 జనగణన ప్రకారం జిల్లా జనాభా 52.96 లక్షలు. రాజధానికి చుట్టూ విస్తరించి ఉండడం.. పట్టణీకరణ నేపథ్యంలో జిల్లా జనాభా గణనీయంగా పెరుగుతోంది. మరోవైపు వలసల తాకిడితోనూ జనాభా సంఖ్యలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జిల్లాకు కొత్త ప్రాజెక్టుల రాక ఉత్సాహాన్ని నింపుతోంది.

దేశంలోనే అతిపెద్ద ఔషధనగరి ఏర్పాటుకు ప్రభుత్వం చురుగ్గా అడుగులు వేస్తోంది. బహుల జాతి కంపెనీలు సైతం రాజధాని శివార్లలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. దీంతో జనాభా పరంగా జిల్లా మరింత ముందుకువెళ్తోంది. నేడు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కథనం..
 - సాక్షి, రంగారెడ్డి జిల్లా /ఘట్‌కేసర్ టౌన్/దోమ

 
నేడు ప్రపంచ జనాభా దినోత్సవం
జనాభా వృద్ధిలో జిల్లా దూసుకెళ్తోంది. జనాభా పెరుగుదల పరంగా రాష్ర్టంలో తొలిస్థానం కైవసం చేసుకుంది. 2001 జనాభా లెక్కల ప్రకారం 35.75 లక్షలతో రెండోస్థానంలో ఉన్న జిల్లా 2011 నాటికి  52.96 లక్షలకు చేరుకుంది. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వలసలు పెరుగుతుండడంతో జనసాంద్రతపై ప్రభావం చూపుతోంది. నగర శివార్లలో ఉపాధి మార్గాలు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాల నుంచి వలసలు, ఉద్యోగాల కోసం ఇక్కడికి వస్తున్నారు.

దీంతో గత దశాబ్బంలో జనసాంద్రత ఒక చదరపు కిలోమీటర్‌కి గణనీయంగా పెరిగింది. దశాబ్దాకాలంలో జనాభా 48.15 శాతం వృద్ధి చెందింది. 1901లో 3.39 లక్షలున్న జనాభా 1981 నాటికి 15.82 లక్షలు, 1991 నాటికి 25.51 లక్షలకు చేరుకుంది. జిల్లా జనసాంద్రత 707 కి.మీ., జిల్లా అక్షరాస్యత 78.05 కాగా  పురుషులు 84శాతం, స్త్రీల అక్షరాసత్య శాతం 71.82గా ఉంది.   విద్యా, ఉద్యోగం, నిరుద్యోగం తదితర కారణాలతో చాలామంది పల్లె నుంచి పట్టణాలకు మకాం మార్చినా పల్లె ప్రాంతాల్లోనే ఎక్కువ మంది ఉండడం విశేషం. 52.96 లక్షల జనాభాలో 34 లక్షల మంది గ్రామాల్లోనే  జీవిస్తున్నారు. మూఢనమ్మకాలు, ఆడపిల్లలపై వివక్ష చూపడంతో జనా భాలో 12 లక్షల మంది మహిళలు తక్కువగా ఉన్నారు.

పెరుగుతున్న సమస్యలు..
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి సరఫరా కావడం లేదు. ఉపాధి కోసం పల్లెల నుంచి పట్టణాలకు వలసలు రావడంతో వారికి వసతి, భద్రత, రక్షణ చర్యలు సదరు యాజమాన్యాలు కల్పించలేకపోతు న్నాయి. దీంతో రోడ్లపై జీవనం గడుపుతున్నారు. ము రికి వాడలు పెరు గుతున్నాయి. నిరుద్యోగం పెరిగి చోరీలు ఎక్కువవుతున్నాయి. రవాణ సౌకర్యం, కంపెనీలు సంఖ్య పెరిగి జల, వాయు కాలుష్యాలు పెరుగుతున్నాయి.
 
చిన్న కుటుంబం మేలు..
జనాభా నియంత్రణ కోసం చిన్న కుటుంబాల లాభాల గురించి ప్రజల్లో విరివిగా ప్రచారం చేయాలి. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలపై అవగాహన కల్పించాలి. మేమిద్దరం, మాకిద్దరు అన్న నినాదాన్ని అమలు చేస్తే పిల్లలకు విద్యా, వైద్య, ఆరోగ్య సమస్యలు తలెత్తవు. చిన్న కుటుంబంతో హాయిగా జీవిస్తున్నారని పలు సర్వేలు సైతం వెల్లడిస్తున్నాయి. పరిమిత సంతానం ద్వారా వ్యక్తిగతంగా, కుటుంబ పరంగానే కాకుండా సామాజికంగా కూడా ఎంతో మేలు జరుగుతుంది. అధిక జనాభాను అరికట్టాలని ఉపన్యాసాలు ఇచ్చే ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలు, అధికారులు పరిమిత సంతానంతో సమాజానికి ఆదర్శంగా నిలవాలి.
 
ఎప్పటి నుంచి..
1987లో ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి జూలై 11న అంతర్జాతీయ జనాభా దినోత్సం నిర్వహిస్తోంది.  
 
అక్షరాస్యత
జిల్లా అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నా అక్షరాస్యతలో మాత్రం మహిళలు పురుషులకంటే వెనుకబడే ఉన్నారు. 2011 జనగణన ప్రకారం అక్షరాస్యతలో పురుషులు 84శాతం ఉండగా, స్త్రీలు 71.82 శాతం ఉండడం పరిస్థితికి
 అద్దం పడుతోంది.  
 
జనసాంద్రత
జిల్లాలో ఉపాధి మార్గాలు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాల నుంచి వలసలు పెరిగిపోయాయి. ఉద్యోగాల కోసం వచ్చేవారి సంఖ్య గణనీయం పెరుగుతోంది.
2001    2011
477           707
 
నివాస సముదాయాలు
రంగారెడ్డి అర్బన్ విస్తీర్ణం చ.కి.మీ     1,034.27
గృహాలు    8,86,201
రంగారెడ్డి రూరల్ విస్తీర్ణం చ.కి.మీ    6,458.73    
గృహాలు    3,49,140
 
 
ఎస్సీ, ఎస్టీలు తక్కువే..
రంగారెడ్డి అర్బన్‌లో 3.27లక్షల మంది ఎస్సీలు, 84వేల మంది వరకు ఎస్టీలు నివసిస్తున్నారు.
ఎస్సీలు మొత్తం    :    3,26,525
పురుషులు    :    1,64,435
స్త్రీలు    :     1,62,090
ఎస్టీలు మొత్తం    :     84,864
పురుషులు    :     44,020
స్త్రీలు    :    40,844
 
 స్త్రీ, పురుష నిష్పత్తి ..

 నాగరికత ఎంత పెరిగినా మహిళల విషయంలో నేటికీ వివక్ష కొనసాగుతూనే ఉంది. సాంకేతిక పెరిగిన తర్వాత ఆడపిల్ల అని తెలిసి కడుపులోనే కడతేరుస్తున్నారు. భ్రూణహత్యలు పెరుగుతున్న దరిమిలా రోజురోజుకూ స్త్రీ, పురుషుల మధ్య నిష్పత్తి ఆందోళన కరంగా మారుతోంది. ప్రస్తుతం ప్రతి వేయి మంది పరుషులకు 955మంది స్త్రీలే ఉన్నారు.

మరిన్ని వార్తలు