బామ్మకు టోకరా

13 May, 2017 02:10 IST|Sakshi
బామ్మకు టోకరా
ఖండవల్లి (పెరవలి) : మనవడు ఇచ్చిన సొమ్ము బ్యాంకులో వేద్దామని వచ్చిన ఓ బామ్మకు సినీఫక్కీలో మస్కా కొట్టి ఓ దొంగ సొమ్ముతో ఉడాయించిన ఘటన పెరవలి మండలం ఖండవల్లి ఆంధ్రాబ్యాంకులో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ఖండవల్లి గ్రామానికి చెందిన తుమ్మూరి లక్ష్మమ్మ శుక్రవారం ఉదయం 10.30 గంటలకు బ్యాంకుకు వచ్చింది. బ్యాంకులో గుర్తు తెలియని వ్యక్తి ఈ బామ్మ వద్దకు వచ్చి ‘నేనూ బ్యాంకులోనే పనిచేస్తున్నాను.. ఫారం రాసి ఇస్తాను..’ అని చెప్పి ఒక ఫారం రాసి ఇచ్చాడు. ఆ వృద్ధురాలు అదే నిజమని నమ్మి నగదు తీసి లెక్కిస్తుండగా ‘నేను లెక్కపెడతాను.. ముందు బ్యాంకు పాస్‌ పుస్తకం జిరాక్స్‌ తీసుకురా’ అని చెప్పి బామ్మ వద్ద నుంచి రూ.60 వేలు తీసుకుని ఆమెను బయటకు పంపించేశాడు. ఆమె అలా వెళ్లగానే ఇచ్చిన సొమ్ముతో ఉడాయించాడు. జిరాక్స్‌ కాపీతో బ్యాంకు లోపలికి వచ్చిన బామ్మ ఆ గుర్తు తెలియని వ్యక్తి కనిపించకపోయే సరికి జరిగిన మోసాన్ని గ్రహించి లబోదిబోమంది. బ్యాంకులోని వారంతా విషయాన్ని గ్రహించి చుట్టుపక్కల గాలించినా దొంగ ఆచూకీ లభ్యంకాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటానా స్థలానికి పెరవలి ఎస్సై పి.నాగరాజు చేరుకుని బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాలో ఫుటేజీని పరిశీలించారు. దొంగను పట్టుకోవటానికి ప్రత్యేక టీమ్‌ను పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
 
మరిన్ని వార్తలు