రెండెకరాల్లో కాసుల వర్షం!

23 Jul, 2017 20:02 IST|Sakshi
రెండెకరాల్లో కాసుల వర్షం!

కొంత కాలంగా టమాట ధర సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది. ఎటు చూసిన పంట సాగు లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి టమాటను దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఫలితంగా ధర అమాంతం ఆకాశాన్ని తాకింది. అయితే ఇదే సమయంలో రెండు ఎకరాల్లో టమాట సాగు చేపట్టిన రైతు పంట కోతకు వచ్చి కాసుల వర్షం కురిపించింది.
- అమడగూరు

ఏకమొత్తంగా రైతులందరూ టమాట సాగు చేయడంతో దిగుబడులు భారీగా పెరిగి ధర అమాంతం తగ్గిపోయింది. దీంతో సాగుదారులు తీవ్ర నష్టాలను మూటగట్టుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన అమడగూరు మండలంలోని రెడ్డివారిపల్లికి చెందిన యువ రైతు పెద్దక నవీన్‌రెడ్డి ముందస్తుగానే జాగ్రత్త పడ్డాడు. తనకున్న రెండు ఎకరాల్లో కాస్త ఆలస్యంగా టమాట సాగు చేపట్టి, ప్రస్తుతం లాభాలు గడిస్తున్నాడు. శనివారం కోతకు వచ్చిన 260 బాక్స్‌ల టమాటను కత్తిరించి, కర్ణాటకలోని చింతామణి మార్కెట్‌కు తీసుకెళ్లాడు. 15 కిలోల బాక్స్‌ రూ. 860తో అమ్ముడు పోయింది. మార్కెట్‌ కమీషన్, వాహనం బాడుగ ఖర్చులు పోను రూ 2 లక్షలు మిగిలింది.

బిందు సేద్యంతో..
ఇంటికి సమీపంలోనే ఉన్న రెండెకరాల్లో ఏప్రిల్‌లో బాయర్‌ 440 రకం టమాట మొక్కలను రైతు నవీన్‌రెడ్డి ఎంపిక చేసుకున్నాడు. అంతేకాక పంట సాగు చేపట్టేందుకు ముందుగానే పొలమంతా బంకమట్టిని తోలి, దుక్కి చేసి మందులు చల్లించాడు. తర్వాత సాలు తీయించి, డ్రిప్‌ పైపులు అమర్చి 7,000 టమాట నారను నాటించాడు. పంట మొలకదశలో ఉన్నప్పుడే క్రిమి సంహారక మందులు పిచికారీ చేయించాడు. పూత దశకు రాగానే పంట ఆశాజనకంగా కనపడడంతో కట్టెలను నాటించి మొక్కలు ఏపుగా పెరిగేందుకు అవకాశం కల్పించాడు. మొత్తం రెండు ఎకరాల్లో పంట సాగుకు రూ. 2 లక్షల వరకు ఖర్చు పెట్టాడు.

తొలి కోతలో రూ. 60 వేలు
ధర లేకపోతే పెట్టుబడి ఎలా రాబట్టుకోవాలనే భయంతో ఉన్న నవీన్‌రెడ్డి.. జూన్‌ 20న పంట తొలి కోత కోశాడు. ఆ సమయంలో రూ 60 వేలు వచ్చింది. తర్వాత వారానికి రెండు కోతలు చొప్పున ప్రతిసారీ 150 నుంచి 250 బాక్సుల వరకూ దిగుబడి రాగాసాగింది. దీంతో ఏకంగా రూ 12 లక్షలు ఆదాయాన్ని ఆర్జించినట్లైంది. ఇంకా తోటలో 1,000 బాక్సుల వరకూ దిగుబడి ఉంటుందన్న ఆశాభావాన్ని రైతు వ్యక్తం చేస్తున్నాడు. ధర ఇలాగే నిలకడగా ఉంటే మరో ఏడు, ఎనిమిది లక్షల వరకూ ఆదాయం వస్తుంది.

జవాబుదారీతోనే లాభాలు
పంట సాగులో జవాబుదారీతో వ్యవహరిస్తే లాభాలు ఆర్జించవచ్చు. అప్పుడప్పుడు టమాట సాగు చేస్తుంటాను. ఒక్కొసారి కేవలం పెట్టుబడులు మాత్రమే వస్తాయి. ఇలా టైం బాగుంటే  దండిగా లాభాలు ఉంటాయి.
పెద్దక నవీన్‌రెడ్డి, యువరైతు, రెడ్డివారిపల్లి

మరిన్ని వార్తలు