రేపు వామపక్షాల ఆధ్వర్యంలో భారత్‌ బంద్‌

26 Nov, 2016 23:58 IST|Sakshi
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకస్మికంగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యులు అల్లాడిపోతున్నారని సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు ప్రభాకరరెడ్డి, రామాంజనేయులు అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో నల్లకుబేరులెవరూ ఇబ్బంది పడటం లేదన్నారు. ఇప్పటికే నోట్ల మార్పిడిలో దేశవ్యాప్తంగా 70 మంది సామాన్యులు మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సుందరయ్య భవన్‌లో ఈనెల 28న నిర్వహించనున్న భారత్‌ బంద్‌ విజయంతానికి తీసుకోవాల్సిన చర్యలపై వామపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు. 86 శాతం చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి ప్రత్నామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 28న నిర్వహించనున్న «భారత్‌ బంద్‌కు ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి నరసింహులు, ఎస్‌యూసీఐ(సీ) జిల్లా నాయకులు నాగన్న, ఫార్వర్డ్‌ బ్లాక్‌ జిల్లా నాయకులు చక్రవర్తి, సీపీఎం నాయకులు గౌస్‌దేశాయ్, ఇ.పుల్లారెడ్డి, సీపీఐ నాయకులు మనోహర్‌ మాణిక్యం పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు