లక్ష ఎకరాలకు తోటపల్లి నీరు

8 Sep, 2016 00:12 IST|Sakshi
సుమిత్రాపురం వద్ద తోటపల్లి కాలువ డిజైన్‌ పరిశీలిస్తున్న కలెక్టర్‌ యాదవ్‌
కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌
 
 
విజయరాంపురం(చీపురుపల్లి రూరల్‌) : ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తోటపల్లి ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తెలిపారు. చీపురుపల్లి మండలం మెట్టపల్లి, విజయరాంపురం, ఎలకలపేట వద్ద తోటపల్లి కుడి కాలువల ద్వారా పొలాలకు నీరందే పరిస్థితిని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తోటపల్లి ప్రాజెక్టు ద్వారా జిల్లాలో కొత్తగా 30 వేల ఎకరాలకు సాగునీరు అందించడం జరిగిందన్నారు. తోటపల్లి కాలువ తవ్వకానికి సంబంధించి భూ సేకరణ సమస్య లేదన్నారు. అనంతరం విజయరాంపురం వద్ద రాజన్న చెరువుకు తోటపల్లి పిల్లకాలువ ద్వారా చేరిన నీరును పరిశీలించారు. అక్కడే రావివలస ఉప సర్పంచ్‌ అన్నంనాయుడు, ఎంపీటీసీ సభ్యుడు రేగిడి వాసు ఇతర రైతులు మాట్లాడుతూ, రాజన్న చెరువు అక్రమణలో ఉందని, దీన్ని తొలగిస్తే మరింత ఆయకట్టుకు సాగునీరు అందుతుందని  కలెక్టర్‌ దష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన స్పందిస్తూ ఆక్రమణలు తొలగించేలా చర్యలు చేపట్టాలని ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ పి. రామకష్ణను ఆదేశించారు. కార్యక్రమంలో తోటçపల్లి ఎస్‌ఈ డోల తిరుమలరావు, ఈఈ రామచంద్రరావు, చీపురుపల్లి తోటపల్లి శాఖ డిప్యూటీ డీఈఈ కె.రామకష్ణ, జేఈ రజనీ, ఎంపీడీఓ ఎస్‌.ఇందిరారమణ, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
–  ఫలితాలపై కలెక్టర్‌ ఆరా
చీపురుపల్లి: తోటపల్లి కాలువ ద్వారా మండలంలో రైతులకు కలిగే ప్రయోజనాలపై కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ ఆరా తీశారు.  మండలంలోని రెడ్డిపేట, సుమిత్రాపురం రెవెన్యూ పరిసరాల్లో గల తోటపల్లి కాలువను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా తోటపల్లి కుడి ప్రధాన కాలువ నుంచి సాగునీటిని విడుదల చేస్తున్న నేపధ్యంలో ఎలాంటి ఫలితాలు వచ్చాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలంలో ఎంత ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నారు, ఎన్ని పంటలు పండిస్తున్నారో రెడ్డిపేట పరిసరాల్లో స్థానికులను అడిగి తెలుసుకున్నారు. రెడ్డిపేట, రేగిడిపేట, తదితర గ్రామాలకు చెందిన వారు పంట పొలాలకు వెళ్లేందుకు అవసరమైన బ్రిడ్జి నిర్మాణం జరగలేదని ఎంపీటీసీ సభ్యుడు వాసు  కలెక్టర్‌ దష్టికి తీసుకొచ్చారు. బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేషన్‌ ఎస్‌ఈ డోల తిరుమలరావు, ఇన్‌చార్జి తహసీల్దార్‌ పప్పల రామకష్ణ, ఎంపీడీఓ ఎస్‌.ఇందిరారమణ, తదితరులు పాల్గొన్నారు.
 
 
  
 
మరిన్ని వార్తలు