పర్యాటక కేంద్రాలు ఏర్పాటు చేయాలి

24 Mar, 2017 23:49 IST|Sakshi
పర్యాటక కేంద్రాలు ఏర్పాటు చేయాలి
– ఎంపీ బుట్టా రేణుక
కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రఖ్యాత ప్రదేశాలను గుర్తించి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక కోరారు. శుక్రవారం ఎంపీ.. ఢిల్లీలోని పార్లమెంట్‌ కార్యాలయంలో సంస్కృతి, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్‌ మహేశ్‌ శర్మను కలిసి ఈ మేరకు విన్నవించారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ.. ఎర్రగుడిలోని అశోకుని శిలా శాసనాలు, మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామి మఠం, పెద్దతుంబళంలోని ప్రాచీన శ్రీరామ దేవాలయం, ఆదోనిలోని కోటా ప్రాంతం, జామా మసీదు, ఎల్లార్తి దర్గా, ఉరుకుంద దేవాలయం, సుంకేసుల డ్యామ్‌ ప్రాంతాలను పర్యాటక అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు.
 
ట్రిపుల్‌ఐటీ కర్నూలులో త్వరగా ప్రారంభించాలి..
ట్రిపుల్‌ఐటీని కర్నూలులో త్వరగా ప్రారంభించాలని పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ను కలిసి కోరారు. కర్నూలుకు మంజూరైన ట్రిపుల్‌ ఐటీ తరగతులను రెండేళ్లుగా కాంచీపురంలోని ట్రిపుల్‌ఐటీకి అనుబంధంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు నగరంలో కేటాయించిన స్థలంలో అవసరమైన నిర్మాణాలు త్వరగా చేపట్టి ఇక్కడే తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి సంబంధించిన భూమిపూజ, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆహ్వానించారు. దీనిపై మంత్రి జవదేకర్‌ స్పందిస్తూ.. తన మంత్రిత్వ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి కర్నూలులో ప్రారంభించే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.  
 
 
మరిన్ని వార్తలు