ఉద్యోగుల క్రికెట్‌ విజేత ‘పోలీస్‌’

3 Apr, 2017 00:40 IST|Sakshi
ఉద్యోగుల క్రికెట్‌ విజేత ‘పోలీస్‌’
ఉద్యోగుల క్రికెట్‌ విజేత ‘పోలీస్‌’
- మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా పోలీస్‌ జట్టు విష్ణువర్ధన్‌రెడ్డి
- మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా గుంతకల్లు రైల్వే జట్టు శ్రీకాంత్‌రెడ్డి
 
అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : చంద్రా స్పోర్ట్స్, మండల క్రికెట్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి ఉద్యోగుల క్రికెట్‌ టోర్నీ విజేతగా పోలీస్‌ జట్టు నిలిచింది. స్థానిక అనంత క్రీడా గ్రామంలోని అనంతపురం క్రీడా మైదానంలో ఆదివారం పోలీస్, ఆర్డీటీ జట్లు ఫైనల్స్‌ ఆడాయి. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన ఆర్డీటీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. జట్టులో నరసింహులు 34, మాంచో ఫెర్రర్‌ 20 పరుగులు చేశారు. పోలీస్‌ జట్టు బౌలర్‌ విష్ణువర్దన్‌ రెడ్డి 4 వికెట్లు పడగొట్టి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. మరో బౌలర్‌ చంద్రమౌళి 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పోలీస్‌ జట్టు 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టులో నరేష్‌ 37, రూరల్‌ ఎస్‌ఐ నాగేంద్ర ప్రసాద్‌ 21, జగన్‌మోహన్‌ 29 పరుగులు చేశారు. పోలీస్‌జట్టు బౌలర్‌ విష్ణువర్ధన్‌రెడ్డికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు ఇచ్చారు. పోలీస్‌ జట్టుకు ట్రాఫిక్‌ ఎస్‌ఐ బాబు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఎస్‌ఐలు హమీద్, రాజు, తేజప్రసాద్‌ తమ ఆటతో క్రీడాకారులను అలరించారు. గుంతకల్లు రైల్వే జట్టు క్రీడాకారుడు శ్రీకాంత్‌రెడ్డిని ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా ఎంపిక చేశారు.
 
భారతజట్టుకు ఆడాలి : ఎస్పీ
జిల్లా నుంచి ఇండియన్‌ క్రికెట్‌ జట్టుకు ఆడాలని ఎస్పీ రాజశేఖర్‌బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ ఉద్యోగుల క్రికెట్‌ టోర్నీ బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆయన, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంచో ఫెర్రర్, కోగటం విజయభాస్కర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఆర్డీటీ చొరవతో క్రీడాభివృద్ధి జరుగుతోందని, క్రీడల ద్వారా గుర్తింపు లభిస్తోందని అన్నారు. జిల్లా నుంచి భారత క్రికెట్‌ జట్టుకు మరో మూడేళ్లలో జిల్లా క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించగలుగుతారన్నారు. మాంచో ఫెర్రర్‌ మాట్లాడుతూ జిల్లాస్థాయి ఉద్యోగుల టోర్నీకి జిల్లా నుంచి 23 జట్లు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో క్రీడాకారులకు కొదువ లేదన్నారు. ఉద్యోగుల టోర్నీల్లోనూ జిల్లా క్రీడాకారులు రాణిస్తున్నారన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్‌ కమిటీ చైర్మన్‌ టీవీ చంద్రమోహన్‌ రెడ్డి, కార్యదర్శి అలీ, ఆర్గనైజర్లు శ్రీవాస్‌రెడ్డి, మధు, కోచ్‌ రవికాంత్‌ తదితరులు పాల్గొన్నారు.
...........................................................
 
మరిన్ని వార్తలు