రోడ్ల విస్తరణకు మోక్షం

28 Aug, 2016 00:58 IST|Sakshi
వనపర్తిలోని ఇరుక్కు ప్రయాణం ఇలా
– వనపర్తిలో తీరనున్న ట్రాఫిక్‌ సమస్య 
– రెండు రోజుల్లో వెలువడనున్న జీఓ 
– ఫలించనున్న మూడు దశబ్దాల  నిరీక్షణ 
 
వనపర్తిలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న రోడ్ల విస్తరణ ఓ కొలిక్కి వచ్చింది. తొందరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది. ఇరుకురోడ్లలో నిత్యం అవస్థలు పడుతున్న వాహనదారులకు, పట్టణవాసులకు ఇకపై ఆ ఇబ్బందులు తొలగనున్నాయి.
 
వనపర్తిటౌన్‌ : వనపర్తి పట్టణంలో దాదాపు 30ఏళ్లుగా ప్రజలను వేధిస్తున్న రోడ్ల విస్తరణ అంశం రెండు రోజుల్లో కొలిక్కి రానుంది. ఈమేరకు రెండురోజుల కిందట పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సంబంధిత ఫైల్‌పై సంతకం చేసి జీఓ జారీకి ఉన్నతాధికారులకు ఫైల్‌ను సిఫారసు చేసినట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చిన్నారెడ్డి ధ్రువీకరించారు. జీఓలో మునిసిపాలిటీలో ఎన్ని అడుగుల మేరకు రోడ్డు విస్తరణ చేయాలో తేలియనుంది. రోడ్ల విస్తరణ సమస్య 30ఏళ్లుగా పాలకులు నాన్చుతున్నారేతప్ప తేల్చడంలేదని పట్టణవాసులు ఏటా పెదవి విరవడం, అదిగో.. ఇదిగో అంటూ ప్రజాప్రతినిధులు కాలం వెల్లదీయడం తెలిసిందే. తెలంగాణ వచ్చిన తర్వాత 2014ఎన్నికల్లో రోడ్ల విస్తరణ అంశం ప్రధాన ఎజెండాగా అన్ని రాజకీయ పార్టీలు ఎత్తుకున్నాయి. ఈ మేరకు 2014అక్టోబర్‌లో వనపర్తి మునిసిపాలిటీ పట్టణంలోని ఐదు రహదారులును 100అడుగుల మేరకు విస్తరించాలని తీర్మానం చేసి సంబంధిత కాపీని మునిసిపల్‌ ఉన్నతాధికారులకు పంపారు. మునిసిపల్‌ తీర్మానం నాటి నుంచి రోడ్ల విస్తరణ అంశం ఊపందుకుంటూనే ఉంది. మూడు నెలల కిందట మునిసిపల్‌ అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రోడ్ల విస్తరణ సంబంధించి సర్వేను నిర్వహించడం తెలిసిందే. దీనికితోడు ఆర్‌అండ్‌బీ అధికారులు వనపర్తిలో రహదారుల విస్తరణకు రూ.204కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. వనపర్తి జిల్లా ప్రకటన కంటే ముందే రోడ్ల విస్తరణ జరుగుతుందని భావించినప్పటికీ జిల్లా ప్రకటన వెలువడిన తర్వాత అందరి చర్చ రోడ్ల విస్తరణపై కేంద్రీకతమైంది. దీంతో పాలకులు వేగం పెంచడంతో రోడ్ల విస్తరణ ఓ కొలిక్కి వచ్చినట్లయ్యింది. 
 
 
30ఏళ్లుగా నరకయాతనకు చెల్లు 
ఎప్పడో తాతల కాలం నాడు అప్పటి జనాభాకు అనుగుణంగా నిర్మించిన రోడ్లే నేటికీ వనపర్తికి దిక్కయ్యాయి. దీంతో 2003నుంచి ఇప్పటివరకు 66మంది ప్రాణాలు కోల్పోగా, 150మంది అవిటివాళ్లుగా మారిపోయారు. రోజురోజుకూ పట్టణ జనాభా లక్ష దాటడం, అందుకు తగ్గట్టుగానే వాహనాల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఇంటినుంచి బయటికి వెళ్తే తిరిగి వస్తామా లేదా? అనే పరిస్థితులు నెలకొన్నాయి. 
 
వనపర్తికి మహర్దశ 
– రమేష్‌గౌడ్, పుర చైర్మన్‌ వనపర్తి 
వనపర్తికి చాలాకాలంగా ఉన్న వెలితి రోడ్ల విస్తరణతో తీరనుంది. భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టుగా విస్తరణ ఉండాలని, మునిసిపాలిటీలో 100అడుగుల మేరకు విస్తరణకు తీర్మానం చేసినం. రాష్ట్ర ప్లానింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ నిరంజన్‌రెడ్డి రోడ్ల విస్తరణకు సంబంధించిన ఫైల్‌ను మువ్‌ చేయడంలో విశేషంగా కషిచేశారు. గత పాలకుల హయాంలో నిర్లక్ష్యం చేశారు. 
 
ఆర్‌అండ్‌బీ ప్రతిపాదనలు ఇవే 
1)వనపర్తి– పానగల్‌ రోడ్డు విస్తరణకు రూ.40కోట్లు 
2) వనపర్తి– కొత్తకోట రోడ్డుకు రూ.42కోట్లు
3)వనపర్తి – హైదరాబాద్‌ రోడ్డుకు రూ.50కోట్లు
4) వనపర్తి– ఘనపురం రోడ్డుకు రూ.40కోట్లు
5) వనపర్తి– పెబ్బేరు రోడ్డుకు రూ.32కోట్లు 
 
 
 
మరిన్ని వార్తలు