అస్తవ్యస్తంగా ట్రాఫిక్‌

5 Aug, 2016 18:17 IST|Sakshi
అస్తవ్యస్తంగా ట్రాఫిక్‌
  •  ప్రైవేట్‌ వాహనాల ఇష్టారాజ్యం
  •  నిరుపయోగంగా బస్టాండ్‌
  • రాయికల్‌: రాయికల్‌ అంగడిబజార్‌లో ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది. లక్షలు వెచ్చించి నిర్మించిన బస్టాండ్‌ నిరుపయోగంగా మారడంతో సమస్య మరింత జటిలంగా తయారైంది. గతంలో శివాజీ ఏరియా నుంచి గాంధీ విగ్రహం దాకా నిర్మించిన బైపాస్‌ రోడ్డు ద్వారా ఆర్టీసీ అధికారులు బస్సులు నడిపారు. అనంతరం వ్యాపారుల ఆందోళనతో విరమించారు. దీంతో మళ్లీ ప్రయాణికులకు తిప్పలు మొదలయ్యాయి. 
    రాయికల్‌ మండలంలో 27 గ్రామాలతోపాటు మేడిపెల్లి, కోరుట్ల, మల్లాపూర్‌ ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు అంగడిబజార్‌ ముఖ్య కూడలిగా మారింది. కోరుట్ల, జగిత్యాల ఆర్టీసీ బస్సులు ఇక్కడే వచ్చి ఆగుతున్నాయి. ప్రైవేట్‌ వాహనాలు ఇక్కడే నిలుపుతున్నారు. నిలబడేందుకు కూడా స్థలం లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్‌ను మెరుగుపర్చడంలో అధికారులు విఫలమవుతున్నారు. 
     
    అంగడిబజార్‌లో అన్నీ సమస్యలే..
    అంగడిబజార్‌లో ప్రయాణికులకు అన్నీ సమస్యలే. నిలబడేందుకు కూర్చొవడానికి షెల్టర్‌ లేదు. మూత్రశాలలు, మరుగుదొడ్ల సౌకర్యం లే క తిప్పలు పడుతున్నారు. ఎండాకాలం, వానకాలంలో దుకాణాల ఎదుట నిలబడితే వ్యాపారులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 
     
    లక్షలు వెచ్చించారు..నిర్లక్ష్యంగా వదిలేశారు..
    మండల కేంద్రంలో లక్షలు వెచ్చించి నిర్మించిన బస్టాండ్‌ను నిర్లక్ష్యంగా వదిలేశారు. పందులు, పశువులకు నివాస కేంద్రంగా మారి శిథిలావస్థకు చేరుకుంది. ఊరికి దూరంగా ఉందని కొంతమంది వ్యాపారులు బస్టాండ్‌ను వినియోగంలోకి రాకుండా చేశారు. బస్టాండ్‌ సమీపంలోనే తహసీల్, ఎంపీడీవో, ఐకేపీ, అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. ప్రజల సౌకర్యార్థం బస్టాండ్‌ను ఆధునీకరించి వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.
మరిన్ని వార్తలు