హోసూరులో విషాదం

10 Jun, 2017 22:21 IST|Sakshi
హోసూరులో విషాదం
- నీటి కుంటలో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి
 పత్తికొండ రూరల్‌: ఈత కోసం వెళ్లిన ఇద్దరు చిన్నారులను నీటి కుంట మింగేసింది. ఈ విషాద ఘటన పత్తికొండ మండలం హోసూరులో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తూర్పుగేరి రంగస్వామి కుమారుడు కార్తీక్‌ (10), పెద్దహుల్తి భాస్కర్‌ కుమారుడు మధు (9)తో పాటు మరో ఇద్దరు చిన్నారులు ఈత సరదా కోసం గ్రామ శివారులోని ఓ రైతు పొలంలో ఉన్న నీటి కుంట వద్దకు వెళ్లారు. ఆటలాడుకుంటూ కుంటలోని లోతును గమనించలేక కార్తీక్, మధు మొదట నీళ్లలోకి దిగారు. ఇటీవలే కురిసిన వర్షం నీళ్లతో ఉన్న కుంటలో పూడిక ఎక్కువగా ఉండటంతో నీళ్లలోకి దిగిన చిన్నారులు పైకి రాలేక మునిగిపోయారు. బయట గట్టుపై ఉన్న మరో ఇద్దరు ప్రమాద విషయాన్ని గమనించి గ్రామానికి వెళ్లి కొందరికి చెప్పారు. గ్రామస్తులు వచ్చేలోగా చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇద్దరు చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. పత్తికొండ ఎస్‌ఐ మధుసూదన్‌రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   
   
పుత్రశోకంతో తల్లడిల్లిన తల్లిదండ్రులు : 
వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రంగస్వామి, నరసమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు మౌనిక, మంజుల కాగా కార్తీక్‌ చివరి సంతానం. అదే కాలనీకి చెందిన భాస్కర్, జయమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు పవన్, మధు, రఘు సంతానం కాగా మధు రెండో సంతానం. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ పిల్లలను నీటి కుంట బలిగొనడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. చిన్నారుల మృతితో కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి.   
 
మరిన్ని వార్తలు