యువకుడిని మింగిన బావి

29 Jun, 2017 23:53 IST|Sakshi
- పోలకల్‌లో విషాదం
 
పోలకల్‌(సి.బెళగల్‌) : మండల పరిధిలోని పోలకల్‌ గ్రామంలో గురువారం.. బావిలో పడి మధు(19) అనే యువకుడు మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. బోయ వీధిలో నివాసముంటున్న బోయ గుడసె సోమప్ప, అనంతమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో రెండో కుమారుడు మధు.. కూలీ పనులకు వెళ్తూ కుటుంబ సభ్యులకు ఆసరాగా ఉండేవాడు. గురువారం గ్రామ సమీపంలోని ఉలిగి నాగన్నకు చెందిన పత్తిపొలంలో గుంటిక పాసేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం 12 సమయంలో దాహం వేయడంతో సమీపంలోని ఉలిగి గిడ్డయ్య బావిలోకి దిగాడు. అయితే కాలుజారి అందులో పడి మృతిచెందాడు. ఈ విషయాన్ని బావి దగ్గర నీళ్లు తాగేందుకు వచ్చిన పశువుల కాపర్లు గుర్తించారు. సమీపంలోని రైతులకు సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహాన్ని వెలికి తీశారు.    సి.బెళగల్‌ ఎస్‌ఐ శ్రీనివాసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. చేతికొచ్చిన కుమారుడు మృతి చెందటంతో తల్లి అనంతమ్మ, కుటుంబ సభ్యులు, బంధువులు రోదించిన తీరు పలువురిని కంట తడి పెట్టించింది. 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు